న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర సందర్భంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో యాత్రను నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ రాసిన లేఖపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. రాహుల్ సాగిస్తున్న జోడో యాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన వస్తుండడంతో కేంద్రంలోని అధికార బిజెపికి భయం పట్టుకుందని, అందుకే అనవసరమైన విషయాలన్నిటినీ ముందుకు తీసుకువస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు.
దేశవ్యాప్తంగా జోడో యాత్ర ప్రభావం చూపుతోందని, యాత్ర విజయవంతం కావడంతో బిజెపి తరఫున అబద్ధపు ప్రచారం సాగించే గోడీ మీడియా భయపడిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. విద్వేషాన్ని వీడండి..భారత్‌ను ఏకం చేయండి పేరిట రాహుల్ సాగిస్తున్న యాత్రను చూసి తట్టుకోలేకపోతున్న కేంద్ర మంత్రి మాండవీయ ఏదో ఒక కుంటిసాకులు చూపి రాహుల్ యాత్రను ఆపాలని ప్రయత్నిస్తున్నారంటూ చౌదరి ఆరోపించారు.