19 రోజుల పాటు రాష్ట్రంలో సాగనున్న యాత్ర
తిరువనంతపురం: కన్యాకుమారినుంచి కశ్మీర్ దాకా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ పేరుతో చేపట్టిన మహాపాదయాత్ర ఆదివారం తమిళనాడునుంచి కేరళ రాష్ట్రంలో ప్రవేశించింది. రెండు రాష్ట్రాల సరిహద్దు అయిన పరస్సాల వద్ద కేరళలోకి ప్రవేశించినప్పుడు ఆ రాష్ట్ర కాంగ్రెస్ సేతలు, పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కేరళ పిసిసి అధ్యక్షుడు , ఎంపి కె సుధాకరన్, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వి డి సతీశన్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి తారిఖ్ అన్వర్, ఎంపిలు కెసి వేణుగోపాల్, వశి థరూర్, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ, రమేశ్ చెన్నితల ప్రభృతులు రాహుల్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
రాహుల్‌కు స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. కాగా రాహుల్ పాదయాత్ర కేరళలో 19 రోజుల పాటు సాగుతుంది. తొలిరోజు పాదయాత్ర తొలి విడతగా పరస్సాల వద్ద ఉదయం ఏడున్నర గంటలకు మొదలై పదిన్నర గంటలకు నెయ్యంతింకార వద్ద ముగిసింది. రెండో దశ సాయంత్రం నాలుగు గంటలకు మొదలవుతుంది. రాహుల్ పాదయాత్రకు సంబంధించిన ఫొటోలను ఆయన సోదరి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, సమాజంలోని ప్రతివర్గమూ భారత్ జోడో యాత్ర పట్ల ఎంతో ఆసక్తితో ఉందని, పెద్ద సంఖ్యలో రైతులు, కార్మికులు, యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు యాత్రలో పాలు పంచుకోవడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. కేరళలో తన 19 రోజుల యాత్రలో రాహుల్ గాంధీ పరస్సాలనుంచి మలప్పురం జిల్లాలోని నిలంబూర్ దాకా 450 కిలోమీటర్లు ప్రయాణిస్తారు.