న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనుచితంగా ప్రవర్తించారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. అవిశ్వాసంపై తన ప్రసంగం పూర్తికాగానే రాహుల్ గాంధీ లోక్‌సభనుంచి బైటికి వెళుతూ వెళుతూ ‘ఫ్లైయింగ్ కిస్’ ఇచ్చారంటూ స్మృతి ఇరానీ ఆరోపించారు. దీనిపై తమ పార్టీ మహిళా ఎంపీలతో కలిసి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. బుధవారం అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తొలుత రాహుల్ గాంధీ మాట్లాడారు. తన ప్రసంగం ముగిసిన కాస్సేపటికే ఆయన బైటికి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ నే ఆయన ఫ్లైయింగ్ కిస్ విసిరారని స్మృతి ఇరానీ ఆరోపించారు. రాహుల్ వైఖరిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ‘స్త్రీ వ్యతిరేకి మాత్రమే పార్ల్లమెంటులో మహిళా ఎంపీలకు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వగలరు. ఇలాంటి విపరీతాలను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. ఆయన మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో ఆయన ప్రవర్తన తెలియజేస్తోంది.
అది అసభ్యకరమైనది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తన ప్రవర్తనతో మహిళలను అవమానించారని ఆరోపిస్తూ బిజెపి ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన లేఖపై దాదాపు 20 మంది మహిళా సభ్యులు సంతకాలు చేశారు. స్మృతి ఇరానీని ఉద్దేశించే రాహుల్ అసభ్యకరమైన సంజ్ఞ చేశారని వారు ఆ లేఖలో ఆరోపించారు. సిసి టీవీ ఫుటేజిని పరిశీలించి కాంగ్రెస్ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరో కేంద్ర మంత్రి, బిజెపి సభ్యురాలు శోభా కరండ్లజే మాట్లాడుతూ ‘స్మృతి ఇరానీ వైపు, మహిళా ఎంపీలందరి వైపు ఫ్లైయింగ్ కిస్ విసురుతూ రాహుల్ వెళ్లిపోయారు. సభ్యుడి ప్రవర్తన సిగ్గు చేటు. ఒక పార్లమెంటు సభ్యుడుగా ఎలా ప్రవర్తించాలో తెలిసుండాలి. పార్లమెంటు చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని సీనియర్ సభ్యులు చెబుతున్నారు. అందుకనే సిసి టీవీ ఫుటేజిలను చూసి సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం’ అని ఆమె చెప్పారు. అయితే కాంగ్రెస్ వర్గాలు ఈ ఆరోపణలు తోసిపుచ్చాయి. ఆయన ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ సంజ్ఞ చేయలేదన్నాయి.
నేను చూడలేదు: హేమామాలిని
ఇదిలా ఉండగా స్పీకర్‌కు బిజెపి ఎంపీలు అందజేసిన వినతిపత్రంలో సంతకాలు చేసిన బిజెపి మహిళా ఎంపీల్లో ఒకరైన హేమామాలిని మాత్రం లోక్‌సభలో రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్ విసరడం తాను చూడలేదని చెప్పడం విశేషం. రాహుల్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ లోక్‌సభకు బిజెపి ఎంపీలు వినతిపత్రం సమర్పించిన కొద్ది సేపు తర్వాత మీడియాతో మాట్లాడిన హేమామాలిని రాహుల్ గాంధీ లోక్‌సభలో ఫ్లైయింగ్ కిస్ విసరడం తాను చూడలేదని చెప్పారు. అయితే ఆయన అన్న కొన్ని మాటలు మాత్రం సరికాదని హేమామాలిని అన్నారు. కాగా హేమామాలిని చేసిన వ్యాఖ్యల వీడియో మాత్రం ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.