Saturday, November 16, 2024

రాహుల్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలి

- Advertisement -
- Advertisement -

ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాల్లో ఆయనది కీలక పాత్ర
రెండు భారత్ జోడో యాత్రలు దోహదం
కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుల ఏకాభిప్రాయం

న్యూఢిల్లీ : లోక్‌సభలో ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలని రాహుల్ గాంధీకి కాంగ్రెస్ కార్యవర్గం (సిడబ్లుసి) సభ్యులు శనివారం ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనకు ఆయన రెండు భారత్ జోడో యాత్రలు దోహదం చేశాయని వారు పేర్కొన్నారు. విస్తృత సిడబ్లుసి సమావేశం అనంతరం విలేకరుల గోష్ఠిలోపార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుని బాధ్యత స్వీకరించాలని రాహుల్ గాంధీకి సిడబ్లుసి సభ్యులు ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేశారని వెల్లడించారు. ‘దీనిపై అతి త్వరలో నిర్ణయం తీసుకుంటానని రాహుల్ గాంధీ చెప్పారు’ అని వేణుగోపాల్ తెలిపారు. 2014లో అధికారం కోల్పోయిన దరిమిలా కాంగ్రెస్‌కు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుని పదవి దక్కడం ఇదే ప్రథమం. గడచిన పది సంవత్సరాల్లో పార్టీ ఆ పదవిని పొందలేకపోయింది.

2014, 2019 ఎన్నికలు రెండింటిలోను సభలోని మొత్తం సీట్లలో ప్రతిపక్ష నేత పదవికి కావలసిన పది శాతం సీట్ల కన్నా తక్కువ గెలవడం అందుకు కారణం. పార్టీ నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహంతో ఉన్నారని, కాంగ్రెస్ పునరుత్థానం మొదలైందన్నది సిడబ్లుసి సెంటిమెంట్ అని వేణుగోపాల్ తెలియజేశారు. సిడబ్లుసి రెండు తీర్మానాలను ఆమోదించింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా నిర్వహించిన పాత్రను శ్లాఘిస్తూ ఒక తీర్మానాన్ని కార్యవర్గం ఆమోదించింది. పార్టీ మెరుగైన ప్రదర్శనకు రాహుల్ గాంధీ సారథ్యంలో సాగిన భారత్ జోడో యాత్రలు కూడా కారణమని కార్యవర్గం కొనియాడింది. తన పేరిట వోటర్ల తీర్పును కోరిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజల తీర్పు రాజకీయ నష్టమే కాకుండా వ్యక్తిగత, నైతిక పరాజయం కూడా అని సిడబ్లుసి తీర్మానం పేర్కొన్నది. కాంగ్రెస్ లోక్‌సభలో రెండవ పెద్ద పార్టీగా అవతరించింది. 2019 ఎన్నికల్లోని 52 నుంచి 99కి పార్టీ తన సీట్ల సంఖ్యను పెంచుకున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News