జైపూర్ : రాజస్థాన్‌లో మళ్లీ కాంగ్రెస్ అధికారం లోకి వస్తే కులగణన నిర్వహిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాజస్థాన్‌లో ఎన్నికలు జరగుతున్న ధోల్‌పూర్, భరత్‌పూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. కేంద్రం లో అధికారం లోకి వచ్చినా జాతీయ స్థాయిలో కులగణన జరిపిస్తామని ప్రకటించారు. దేశం లోని దళితులు, వెనుకబడిన తరగతులు తమ కులాల జనాభా వాస్తవంగా ఏమాత్రం ఉందో తెలుసుకోడానికి కులగణన తప్పనిసరి అని రాహుల్ వివరించారు.
ఇంతకు ముందు ప్రధాని మోడీ తాను ఒబిసికి చెందినవాడినని చెప్పుకునే వారని, కులగణన కోసం తాను డిమాండ్ చేసిన తరువాత దేశంలో ఒకే ఒక కులముందని చెప్పడం ప్రారంభించారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ, పారిశ్రామిక వేత్త అదానీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వీరంతా ప్రజల జేబులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అదానీ ప్రజలను కొల్లగొడుతుంటే, అమిత్‌షా ప్రజలపై లాఠీలు ఝళిపిస్తుంటే ప్రధాని మోడీ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ధ్వజమెత్తారు. అగ్నిపథ్ పథకం ప్రవేశ పెట్టి దేశాన్ని రక్షించాలని కలలు కనే లక్షలాది యువత స్వప్నాలను భగ్నం చేశారని విమర్శించారు.