అంబికాపూర్ : ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పక్షంలో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టబద్ధమైన గ్యారంటీలు ఇస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగళవారం ప్రకటించారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉద్యమం సాగిస్తున్న రైతులపై బాష్పవాయువు ప్రయోగించినందుకు, వారిని జైళ్లలో నిర్బంధించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ తీవ్రంగా విమర్శించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో చేరుస్తామని కూడా ఆయన సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా కేంద్రం అంబికాపూర్‌లో తన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, దేశంలో చిన్న వాణిజ్యవేత్తలను దెబ్బ తీయడానికి ప్రధాని నరేంద్ర మోడీ జిఎస్‌టిని, పెద్ద నోట్ల చలామణీ రద్దును ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
‘ఢిల్లీ చలో’ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర సంస్థ), కిసాన్ మజ్దూర్ యూనియన్ లేవనెత్తిన ప్రధాన డిమాండ్లలో పంటలకు ఎంఎస్‌పిపై చట్టం, రుణ మాఫీలు ఉండడం గమనార్హం. ‘ఇప్పుడు రైతులు ఢిల్లీ దిశగా సాగుతున్నారు. కాని వారిని నిలువరిస్తున్నారు. వారిపై బాష్ప వాయు గోళాలు ప్రయోగిస్తున్నారు. వారిని జైళ్లలో నిర్బంధిస్తున్నారు. తమ కఠిన శ్రమకు, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ప్రతిఫలం ఉండాలని వారు న్యాయంగా కోరుతున్నారు’ అని రాహుల్ చెప్పారు.
వ్యవసాయం, రైతుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారత రత్న ప్రకటించిందని, కానీ అది ఆయన సూచనల అమలుకు సిద్ధంగా లేదని ఆయన అన్నారు. ‘రైతులకు ఎంఎస్‌పి కోరే చట్టబద్ధమైన హక్కు ఉందని స్వామినాథన్‌జీ తన నివేదికలో స్పష్టం చేశారు. కానీ, బిజెపి ప్రభుత్వం అలా చేయడం లేదు. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే మా ప్రభుత్వం రైతుల కోసం ఎంఎస్‌పికి చట్టబద్ధమైన గ్యారంటీలు ఇస్తుంది’ అని రాహుల్ చెప్పారు. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత స్వామినాథన్ నివేదికలోని సిఫార్సులను నెరవేరుస్తుంది’ అనిఆయన చెప్పారు. ‘ఇది మా నాంది మాత్రమే. మా మానిఫెస్టో రూపొందుతోంది. రైతులు, కూలీల కోసం మేము పాటుపడబోతున్నాం’ అని రాహుల్ చెప్పారు.