Monday, December 23, 2024

ప్రతి గ్రామ పంచాయతీకి రాహుల్ గాంధీ కోటి రూపాయల వాగ్దానం!

- Advertisement -
- Advertisement -
కర్నాటక ప్రాంతానికి రూ. 5 వేల కోట్లు!!

జేవర్గి: కర్నాటకలో మే 10న జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటేసి గెలిపించినట్లయితే, ప్రతి గ్రామ పంచాయతీకి కోటి రూపాయలు, కళ్యాణ కర్నాటక ప్రాంతానికి రూ. 5000 కోట్లు కేటాయిస్తానని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వాగ్దానం చేశారు. ఆయన కలబురగిలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తానని అన్నారు. ‘మేము ఈ ప్రాంతానికి రూ. 5000 కోట్లు కేటాయిస్తాం. ప్రతి గ్రామ పంచాయతీకి కోటి రూపాయలు కేటాయిస్తాం’ అన్నారు.

కళ్యాణ కర్నాటక ప్రాంతంలో బీదర్, యాద్‌గిర్,రాయిచూర్, కొప్పల్, కలబురగి, బళ్లారి, విజయనగర ఉన్నాయి. రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ‘భారతీయ జనతా పార్టీకి కేవలం 40 సీట్లే వస్తాయి. కానీ ఆ పార్టీ పెద్ద మెజారిటీ సాధిస్తానని కలలు కంటోంది’ అని జోస్యం చెప్పారు. పబ్లిక్ వర్క్ కోసం కర్నాటకలో బిజెపి మంత్రులంతా కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమిషన్ తీసుకుంటారని ఆరోపించారు. ‘అందుకే ఇప్పుడా పార్టీకి 40 సీట్లకు మించి రావు’ అన్నారు. ‘కాంగ్రెస్ 150కి పైగా సీట్లను గెలుచుకోగలదు, తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. అసలు బిజెపి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు, దొడ్డి దారిలో ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష పార్టీల ఎంఎల్‌ఎలను కొనుక్కున్నది. మేము ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఎవరూ ఆపలేరు’ అన్నారు.

తాము గెలిస్తే ఇంటి పెద్ద మహిళకు రూ. 2000, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, నిరుద్యోగ పట్టభద్రులకు రూ. 3000, నిరుద్యోగ డిప్లోమా హోల్డర్లకు రూ. 1500(18 నుంచి 25 ఏళ్లు ఉన్న వారికి) రెండేళ్లపాటు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం ఇస్తామని ఇదివరకే ప్రకటించారు రాహుల్ గాంధీ. తాజాగా గురువారం ఐదో గ్యారంటీ కూడా ప్రకటించారు. అదేమిటంటే ప్రజా రవాణా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News