మొకోన్‌గోన్(నాగాలాండ్): దేశంలో భిన్న మతాలపై ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి దాడి చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇటువంటి శక్తులకు వ్యతిరేకంగా సైద్ధాంతిక యుద్ధాన్ని సాగించడమే తన భారత్ జోడో న్యాయ యాత్ర లక్షమని ఆయన స్పష్టం చేశారు. తన భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా నాగాలాండ్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ బుధవారం నాడిక్కడ పెద్ద సంఖ్యలో హాజరైన జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ మీ సాంప్రదాయాలను, మీ ఆహారపు అలవాట్లను, మీ వస్త్రధారణను నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. ప్రతి సంస్కృతిని, ప్రతి మతాన్ని గౌరవించాలని ఆయన అన్నారు. ఈశాన్య రాష్ట్రాల జనాభా తక్కువే అయినప్పటికీ దేశంలోని ఇతర ప్రాంతాలతో సమానంగా అందరూ ముఖ్యమేనని ఆయన చెప్పారు. రెండు ముక్కలుగా చీరిపోయిన మణిపూర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు సందర్శించనందుకు తాను సిగ్గుపడుతున్నానని రాహుల్ వ్యాఖ్యానించారు.
తొమ్మిదేశళ్ల క్రితం నాగాలాండ్ ప్రజలతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి చెందిన వాగ్దానాలను అమలు చేయనందుకు కూడా తాను సిగ్గుపడుతున్నానని ఆయన అన్నారు. యువతనుద్దేశించి ప్రసంగిస్తూ నాగాలాండ్ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకోసం యువత ముఖ్యంగా బాలికలు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ మీకు రాహుల్ గాంధీ అనే సైనికుడు ఉన్నాడని గుర్తుంచుకోండి అని ఆంటూ ఆయన హామీ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా నాగాలాండ్ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్ష పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు అనుభవిస్తున్న మంచి రోడ్లు, విద్యుత్, ఆసుపత్రులు, ఇతర మౌలిక సౌకర్యాలు నాగాలాండ్ ప్రజలు ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. నాగా యువజనులు ఈ రోడ్లపై ప్రయాణించి పోటీ పరీక్షలు ఎలా రాయగలరని, ఇంట్లో విద్యుత్ లేకుండా దేశంలోని ఇతర ప్రాంతాల పిల్లలతో ఎలా పోటీపడగలరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంలోని అధికార పార్టీ కొంతమందికి మాత్రమే సాయపడుతోందని, అందుకే దేశంలోని 500 అగ్రశ్రేణి కంపెనీలలో నాగాకు చెందిన కంపెనీ ఒక్కటీ లేదని ఆయన విమర్శించారు. మీ దగ్గర పరిష్కారం లేకపోతే దయచేసి ప్రజలకు అబద్ధాలు చెప్పి శుష్క వాగ్దానాలు చేయకండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని వారితో చర్చలు జరపకుండా సమస్యకు పరిష్కారం కనుగొనలేమని ఆయన చెప్పారు. ప్రజలు చెప్పేది విని వారి బాధను పంచుకోవడమే తన భారత్ జోడో న్యాయ యాత్ర అసలు ఉద్దేశమని ఆయన అన్నారు. నాగాలాండ్ ప్రజలు తమ సమస్యలు తనతో చెప్పుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ యాత్ర ముగిసిన తర్వాత తాను నాగాలాండ్ వచ్చి కొద్ది రోజులు మీతో గడుపుతానని ఆయన హామీ ఇచ్చారు.