Monday, December 23, 2024

భారత వ్యతిరేక వ్యాఖ్యలేమీ చేయలేదు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

భారత వ్యతిరేక వ్యాఖ్యలేమీ చేయలేదు
అనుమతిస్తే సభలోనే సమాధానమిస్తా..లేదంటే బైట చెప్తా
బ్రిటన్‌లో వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామంపై బ్రిటన్‌లో ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. తాను ఎలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై నలుగురు కేంద్రమంత్రులు ఆరోపణలు చేశారని, వాటిపై పార్లమెంటులో స్పందించే హక్కు తనకు ఉందని తాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు చెప్పానని రాహుల్ అన్నారు. బ్రిటన్ పర్యటననుంచి తిరిగొచ్చిన రాహుల్ గాంధీ గురువారం పార్లమెంటుకు హాజరయ్యేందుకు వెళ్తూ ఎఐసిసి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.

‘ఒక ఎంపీగా నాపై వచ్చిన ఆరోపణలకు పార్లమెంటులో సమాధానమివ్వాల్సిన బాధ్యత నాపై ఉంది.అ తర్వాత మాత్రమే వివరంగా మీకు వివరిస్తాను’ అని రాహుల్ అన్నారు. శుక్రవారం పార్లమెంటులో మాట్లాడేందుకు తనకు అవకాశమిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా ఇంతకు ముందు పార్లమెంటులో తాను చేసిన ప్రసంగంలో అదానీ గ్రూపుపై తాను అడిగిన ప్రశ్నలకు ప్రధానినరేంద్ర మోడీ ఇంతవరకు సమాధానమివ్వలేదని రాహుల్ అన్నారు. అంతకు ముందు బ్రిటన్ పర్యటననుంచి తిరిగివచ్చిన రాహుల్ గాంధీ పార్లమెంటు హౌస్‌కు వచ్చి లోక్‌సభలో తనకు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని కోరేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు.

భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ బ్రిటన్ వేదికగా రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్న బిజెపి నేతలు విదేశీ గడ్డపై భారత్ పరువు తీస్తున్నారని రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ క్షమాపణలు చెప్పాలని బిజెపి గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తోంది. మరోవైపు పార్లమెంటు ఉభయసభల్లోను ఈ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు కొనసాగుతుండడం, ఉభయసభలు వాయిదా పడుతుండడం తెలిసిందే. పలువురు కేంద్రమంత్రులు రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు విలేఖరులతో మాట్లాడుతూ దేశ వ్యతిరేక శక్తుల మాదిరి ఆయన మాట్లాడారంటూ మండిపడ్డారు.‘ రాహుల్ గాంధీ దేశాన్ని అవమానించేందుకు యత్నిస్తే పౌరులుగా చూస్తూ ఊరుకోలేం. కాంగ్రెస్ నాయకత్వాన్ని తిరస్కరించినంతమాత్రాన ఆయన విదేశాల్లో భారత్ పరువు తీయొచ్చని అర్థం కాదు’ అని అన్నారు. అయితే బిజెపి వ్యాఖ్యలను కాంగ్రెస్ తిప్పికొడుతోంది. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వారే దాన్ని రక్షించాలని మాట్లాడుతుండడం దురదృష్టకరమని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News