న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ సోమవారం ట్రాక్టర్‌ను నడుపుతూ పార్లమెంట్‌కు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాలను రద్దు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ ఎంపీలు ప్రతాప్ సింగ్ బజ్వా, రవనీత్ సింగ్ బిట్టూ, దీపీందర్ సింగ్ మూడా, గుర్జీత్ సింగ్ అవుజ్లా, జస్బీర్ సింగ్ గిల్, తదితర నాయకులు బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేస్తూ పార్లమెంట్‌కు చేరుకున్నారు. రైతుల సందేశాన్ని తాను పార్లమెంట్‌కు తీసుకువచ్చానని రాహుల్ తెలిపారు. పార్లమెంట్‌లో ఈ సమస్యను చర్చించడానికి అనుమతించడం లేదని, దేశవ్యాప్తంగా రైతుల గొంతు నొక్కివేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. అందుకే తాము ఈ సమస్యను పార్లమెంట్ వద్దకు తీసుకువచ్చామని, వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలు కేవలం ఇద్దరు ముగ్గురు బడా పారిశ్రామికవేత్తలకు తొడ్పడేందుకు ఉద్దేశించినవని ఆయన ఆరోపించారు. అనంతరం రాహుల్ హిందీలో ఒక ట్వీట్ చేస్తూ రైతులు తమ భూములను అమ్ముకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తే పార్లమెంట్‌లోకి ట్రాక్టర్ దూసుకువస్తుందని హెచ్చరించారు.
Rahul Gandhi rides tractor to Parliament protest against farm laws