మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆదివారం ఉత్సాహ భరితంగా కొనసాగింది. అందరిని కలుస్తూ, వారితో పలకరిస్తూ ఉత్సాహంగా రాహుల్ గాంధీ ముందుకు కదిలారు. 44వ జాతీయ రహాదారిపై వాహనాలు ఆపి ప్రయాణీకులు, వాహనదారులు రాహుల్‌ని కలిశారు. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ సమీపంలో చిన్నారులు ఆఫ్రాన్, అమీర్ రాహుల్‌ను కలిశారు. ఆయన వారితో ముచ్చటించారు. రోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేస్తారా.. అని రాహుల్ అడిగారు. తనతో రన్నింగ్ చేస్తారా అంటూ వారిని ప్రశ్నించిన రాహుల్ పరుగు పండెం పెట్టుకుందామా అని చిన్నారులను అడిగారు. చిన్నారులతో కలిసి పరుగెత్తారు.
దాదాపు 100 మీటర్ల వరకు రాహుల్ పరుగెత్తారు. రాహుల్ వెనుకాల చిన్నారులతో పాటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతన కాంగ్రెస్ నాయకులు కూడా పరుగందుకున్నారు. అయితే వేగంగా పరుగెత్తుతున్న రాహుల్‌ను అందుకోలేక పోయారు. రాహుల్ పరుగెత్తగా పాదయాత్రలో ఉన్న జనం కేరింతలు కొట్టారు. 53వ రోజు పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ టీ బ్రేక్ సమయంలో బతుకమ్మ నృత్య ప్రదర్శనను తిలకించారు. జోడో యాత్ర సాంస్కృతిక కమిటి చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క ఆధ్యర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో రాహుల్ నాయకులు, మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. సీనియర్ నేత జైరాంరమేష్, కెసి వేణుగోపాల్, రేవంత్ రెడ్డి తదితర నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు.
Rahul Gandhi Run in Bharat Jodo Yatra