Saturday, December 21, 2024

తోడో తంతుల్లేని దేశం కోసం జోడో యాత్ర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తన భారత్ జోడో యాత్ర ఆగదని, దేశంలో విద్వేషం తొలిగిపోయి, ఇండియా ఐక్యంగా నిలిచే వరకూ ఇది సాగుతూనే ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. తన భారత్ జోడో యాత్ర తొలి వార్షికోత్సవం నేపథ్యంలో గురువారం ఆయన సందేశం వెలువరించారు. గత ఏడాది ఇదే రోజున ( 7 సెప్టెంబర్) కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సాగిన 4000 కిలోమీటర్ల యాత్రకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌లను ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తమ ట్విట్టర్ (ఎక్స్) మాధ్యమంలో పొందుపర్చారు. హిందీలో ఈ సందర్భంగా సందేశం వెలువరించారు. తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ ప్రజల మనస్సులను ఏక సూత్రంతో బంధించేందుకు ఉద్ధేశించింది. ఇది ఆగేది కాదు. సాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. దేశం సమైక్యంగా ఉండాలి, భేదభావనలు, విద్వేషాల నీలినీడలు తొలిగిపొయ్యే వరకూ నిర్విరామంగా సాగుతుందని తెలిపారు. జోడోయాత్ర కోట్లాది అడుగులు అన్నీ కూడా ఐక్యతా దిశలో వేసినవే. ప్రేమానురాగాలు, సోదరభావంతో పరుగులు తీసినవే.

ఓ సముచితమైన రేపటి కోసం, ఈ దేశం కోసం పడిన పునాది రాళ్లే అని తెలిపారు. ఇది కేవలం తాత్కాలిక మజిలి కాదని, ఉజ్వల భారతం కోసం చేపట్టిన ప్రయాణం అని, ఇందులో తానొక్కడినే కాకుండా దేశ ప్రజలంతా బాటసారులే అని రాహుల్ తెలిపారు. గత ఏడాది రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా డజన్ బహిరంగ సభలు ఏర్పాటు అయ్యాయి. వందకు పైగా వీధి కూడళ్ల సభలు జరిగాయి. 13 చోట్ల ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగాయి. కాగా తనను కలవడానికి వచ్చిన వివిధ సామాజిక వర్గాల వారితో ముచ్చటించడం , వారి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. నడుస్తూనే మాటామంతీలు, ఒక్కచోట కూర్చుని ముచ్చటించడాలు చోటుచేసుకున్నాయి. ఈ విధంగా జోడో యాత్రకు విశేష ఆదరణ లభించిందని విమర్శకులు తెలిపారు. రాహుల్‌ను రాజకీయంగా పరిపక్వత దశకు ఈ యాత్ర చేర్చిందనే వ్యాఖ్యానాలు విన్పించాయి. ఓ దశ వరకూ పార్ట్‌టైమ్ రాజకీయ నేత అని, ఏదో మొక్కుబడిగా రంగంలోకి దిగాడని వచ్చిన పలు అపవాదులు, ఏర్పడ్డ నిక్‌నేమ్‌లు అన్ని ఈ సీరియస్ యాత్రతో తొలిగిపోయి ,

చివరికి ఆయన సమీప రాజకీయ ప్రత్యర్థి పార్టీలు కూడా ఆయన ఓ సవాలు అయినట్లు అంగీకరించాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో విభిన్న వర్గాలకు చెందిన వారు, సామాజిక భిన్న వర్గాల వారు పాల్గొన్నారు. సినిమా, టీవీ ప్రముఖులు అయిన కమల్‌హాసన్ , పూజా భట్, రియాసేన్ , స్వర భాస్కర్, అమోల్ పాలేకర్ వంటి వారు జోడో యాత్రకు ఆకర్షణ విషయంలో తోడయ్యారు. కాగా రచయితలు, హక్కుల నేతలు, రిటైర్డ్ ఆర్మీచీఫ్ జనరల్ దీపక్ కపూర్, నేవీ మాజీ ఉన్నతాధికారి అడ్మిరల్ ఎల్ రాందాస్, ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ , ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అరవింద్ మయరం వంటి కూడా పాల్గొన్నారు. కాగా అత్యంత సీనియర్ రాజకీయ నేత డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఆదిత్యా థాకరే, ప్రియాంక చతుర్వేది, సంజయ్ రౌత్, సుప్రియా సూలే వంటి నేతలు రాజకీయ పార్టీలకు అతీతంగా రాహుల్ యాత్రలో పాల్గొన్నారు. ఓ దశలో కుమారుడు రాహుల్‌తో కలిసి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ కూడా నడిచారు. ఈ విధంగా సమగ్రతను సంతరించుకున్న తమ జోడో యాత్ర దేశంలో సామరస్యం దిశలో మైలురాయి అయిందని రాహుల్ స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News