‘ప్రస్తుతం మీ పార్టీ పరిస్థితి ఏమిటి?’ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కుతూహలంగా ప్రశ్నించినందుకు, బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్‌పి) చీఫ్ మాయావతి గురువారం దుమదుమలాడింది. తన ‘ఎక్స్’ పోస్ట్‌లో ‘కాంగ్రెస్ ఎక్కడ బలంగా ఉన్నా లేదా అధికారంలో ఉన్నా, అక్కడ బిఎస్‌పి, దాని అనుచరులపట్ల శత్రుత్వం, కులతత్వ వైఖరిని అనుసరిస్తుంది. కానీ ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అది బలహీనంగా ఉన్నప్పుడు, బిఎస్‌పితో పొత్తు గురించి మాట్లాడటం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తుంది. ఇది వంచన కాకపోతే, మరేమిటి?’అని పెర్కొంది. విషయం ఏమిటంటే రాహుల్ గాంధీ గురువారం తన నియోజకవర్గం అయిన రాయ్‌బరేలికి వెళ్లారు.
అక్కడ ఆయన దళిత విద్యార్థులతో మాటామంతీ జరిపారు. ఆ సందర్భంగా ఆయన ‘బిజెపికి వ్యతిరేకంగా బహన్‌జీ మాతో కలిసి పోరాడాలని నేను కోరుకుంటున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె అలా చేయడం లేదు. అది ఎంతో నిరాశ కలిగిస్తోంది. ఒకవేళ మన మూడు పార్టీలు ఏకమై పోరాడి ఉంటే బిజెపి గెలిచి ఉండేది కాదు. ఆమె బిజెపిని వ్యతిరేకిస్తున్న ఇండియా బ్లాక్‌కు దూరంగా ఉంటున్నారు’ అన్నారు. 2024లో కాంగ్రెస్ సమాజ్‌వాదీ పార్టీ కలిసి ఉత్తర్‌ప్రదేశ్‌లో పోటీచేశాయి. అప్పుడు అధిక జనాభా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో ఫైజాబాద్ లోక్‌సభ సీటు సహా 43 సీట్లను గెలుచుకుని బిజెపిని నిలువరించాయి.
మాయావతి, రాహుల్ గాంధీపై విరుచుకుపడుతూ ‘కాంగ్రెస్‌ది బిఎస్‌పి మద్దతుదారులపట్ల ద్విముఖ వైఖరి. కులతత్వ స్వభావం కలది. గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు బిఎస్‌పికి హానే కలిగింది. కాంగ్రెస్, ఇతర కులతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు మా బేస్ ఓట్లే వారికి పోయాయి. కానీ వారి నుంచి మాకు తిరిగి ఎలాంటి లాభం కలుగలేదు. ఆ కారణంగా బిఎస్‌పి ఎప్పుడు ఓటమినే చవిచూసింది’ అని మాయావతి తన ‘ఎక్స్’పోస్ట్‌లో పేర్కొంది. అంతేకాక ఆమె ‘వారు(కాంగ్రెస్, బిజెపి) డాక్టర్ అంబేద్కర్‌ను, బిఎస్‌పిని, దాని నాయకత్వాన్ని, దళితబహుజన్ అనుచరులను నిరంతరం వ్యతిరేకించారు. వారి విధానాలు సమానత్వం, సంక్షేమం అనే రాజ్యాంగ లక్ష్యాలను దెబ్బతీశాయి’ అన్నారు. కానీ రాహుల్ గాంధీ దళిత విద్యార్థులతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక ప్రశ్నకు జవాబుగా ‘నేను బిఎస్‌పి వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌ను నమ్ముతాను. ఆయన ఆదర్శాలపైనే సోదరి(మాయావతి) పార్టీని నిర్మించింది’ అన్నారు. అది కూడా ఆమె రాజకీయ వైఖరిని ప్రశ్నించడానికి ముందు.