Monday, December 23, 2024

Rahul Gandhi: రాహుల్‌కి శిక్ష!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: నాలుగేళ్ళ క్రితం 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీను ద్దేశించి చేసిన ఒక వ్యాఖ్యపై దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు గురువారం నాడు రెండేళ్ళ శిక్ష విధించింది. ఆయనను వెంటనే జైలుకు పంపించకుండా నెల రోజుల బెయిల్‌ను కూడా మంజూరు చేసింది. గుజరాత్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంఎల్‌ఎ పూర్ణేశ్ మోడీ ఈ కేసును దాఖలు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్య మొత్తం మోడీ కులాన్నే అప్రతిష్ఠకు గురి చేసిందని ఆయన ఆ పిటిషన్‌లో ఆరోపించారు. వాస్తవానికి మోడీ అనే ప్రత్యేక కులం లేదు. రాహుల్ గాంధీ కర్నాటకలో ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ దొంగలందరి ఇంటి పేరు మోడీయే (నీరవ్‌మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ) ఎందుకు అవుతున్నది అని ప్రశ్నించారు.

నీరవ్ మోడీ ఒక వజ్రాల వ్యాపారి. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 14000 కోట్లకు మోసం చేసి విదేశాలకు పారిపోయాడు. అలాగే లలిత్ మోడీ ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మాజీ చీఫ్. క్రికెట్ బోర్డు ఆయనపై జీవిత కాల నిషేధాన్ని విధించింది. ప్రధాని మోడీ హయాంలో అవినీతి పేరుకుపోయిందనే విషయాన్ని వేలెత్తి చూపడానికి రాహుల్ గాంధీ ఈ విమర్శనాస్త్రాన్ని సంధించారు. రాజకీయాల్లో ఇటువంటి విమర్శలు సర్వసాధారణమైపోయాయి. ప్రధాని మోడీ తనను తాను దేశ ప్రజలకు చౌకీదారుగా చెప్పుకొన్న విషయం తెలిసిందే. దానిని ఆసరా చేసుకొని చౌకీదారే (కాపలాదారే) చోర్ (దొంగ) గా మారాడని రాహుల్ గాంధీయే విమర్శించిన సంగతి విదితమే. చౌకీదార్ విమర్శకు ఎదురు కాని కేసు ‘మోడీల’ విమర్శకు ఎదురవడం విచిత్రం. ఈ కేసులో కోర్టుకెక్కిన బిజెపి శాసన సభ్యుని ఇంటి పేరు కూడా మోడీయే. బిజెపియే ఆయన చేత ఈ కేసును దాఖలు చేయించిందనే అభిప్రాయానికి ఇది ఆస్కారం కలిగిస్తుంది.

అందుకే ఈ శిక్ష వార్తపై విమర్శలు బయలుదేరాయి. ‘లాయర్లందరూ దొంగలే అని ఎవరైనా అంటే ఒక లాయర్‌గా నేను ఆ వ్యక్తిపై పరువు నష్టం దావాను వేయడానికి అవకాశం లేదని ఆ వ్యాఖ్య నన్ను ఉద్దేశించినది అయినప్పుడు మాత్రమే కేసు వేసే అవకాశం నాకు వుంటుంది’ అని ప్రముఖ న్యాయశాస్త్ర నిపుణుడు గౌతమ్ భాటియా ట్వీట్ చేశారు. కోర్టులో ఈ శిక్ష ప్రకటించినప్పుడు రాహుల్ గాంధీ అక్కడే వున్నారు. మోడీలు ముగ్గురినీ పోల్చుతూ తాను చేసిన ప్రసంగం ప్రజాస్వామ్య మనుగడ కోసం చేసిందేనని రాహుల్ న్యాయమూర్తితో అన్నారు. ఇటువంటి శిక్షలు, ప్రతీకార చర్యలు దేశంలో ప్రజాస్వామిక సహనం నశించిపోతున్నదనే సత్యాన్ని చాటుతాయి. ‘మోడీ హఠావో, దేశ్ బచావో’ అంటూ ఢిల్లీలో వెలిసిన వేలాది పోస్టర్లను మొన్న బుధవారం నాడు పోలీసులు తొలగించి అందుకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసి వంద ప్రాథమిక అభియోగ పత్రాల (ఎఫ్‌ఐఆర్)ను దాఖలు చేశారు. దేశంలో భావప్రకటనా స్వేచ్ఛ అడుగంటిపోతుందనడానికి ఇటువంటివి గట్టి ఉదాహరణలు.

దేశాన్ని పాలిస్తున్న రాజకీయ పార్టీని గాని, దాని నేతలను గాని, ప్రధాని వంటి పదవులను అలంకరించి వున్న వ్యక్తులను గాని దేశ దుస్థితికి బాధ్యులను చేస్తూ విమర్శించడం ఆ క్రమంలో కటువైన మాటలు దొర్లడం ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమే గాని హానికరం ఎంత మాత్రం కాదు. బ్రిటన్‌లో న్యాయమూర్తులను నిందించినా దానిని తప్పుగా పరిగణించరు. వారు న్యాయాన్ని అందించే ప్రక్రియకు ఎవరైనా అడ్డుపడినప్పుడు మాత్రమే దానిని నేరంగా పరిగణిస్తారు. మన మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తనను హేళన చేస్తూ, ఎత్తి పొడుస్తూ మీడియాలో వచ్చే వ్యంగ్య చిత్రాలను చూసి ఎంత మాత్రం నొచ్చుకోకపోగా ఆ వ్యంగ్య చిత్రకారులను ప్రశంసించిన సందర్భాలున్నాయి. అసమ్మతిని, ప్రతిపక్షాన్ని సహించగలిగిన వారే నిజమైన ప్రజాస్వామికులవుతారు.

ఇతరుల భావాలతో ఏకీభవించకపోడమేనేది దేషానికి, హింస కు దారి తీయకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్ గురువారం నాడు ఢిల్లీలో 16వ రామ్‌నాథ్ గోయెంకా జర్నలిజం అవార్డుల ఉత్సవంలో మాట్లాడుతూ అన్నారు. భిన్నాభిప్రాయం, అసమ్మతి, ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి ముఖ్యమైన అవసరాలని గుర్తించవలసి వుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నదనడానికి ఇవి నిరాటంకంగా మనుగడ సాగించడమే గీటురాయి. ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ విషయాన్ని నిర్లక్షం చేస్తూ విమర్శకులను వేటాడుతున్నది. ఉపా వంటి కఠినమైన చట్టాల ద్వారా వారిని కష్టాలపాలు చేస్తున్నది. రాహుల్ గాంధీకి శిక్ష విధింపును మొట్టమొదటగా కాంగ్రెస్‌కు బద్ధ విరోధి అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)యే ఖండించడం గమనార్హం. కేసులు పెట్టి బిజెపియేతర నాయకులను, పార్టీలను రంగం నుంచి తొలగించే కుట్ర నడుస్తున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్‌తో తమకు విభేదాలున్నాయని అదే సమయంలో రాహుల్ గాంధీని ఈ విధంగా పరువు నష్టం కేసులో ఇరికించడం పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News