Wednesday, January 22, 2025

డ్రైవర్ల “మన్‌కీబాత్ ” ఆలకించిన రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్ జోడో యాత్రలో దేశ మంతా పాదయాత్ర చేసి సామాన్య ప్రజానీకంతో కలసిమెలసి వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు ట్రక్కు డ్రైవర్ల సమస్యలను కూడా తెలుసుకోడానికి ప్రయత్నించారు. ఇందుకు ట్రక్కులో ప్రయాణించి వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించారు. సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి ఛండీగఢ్‌కు ట్రక్కులో ఆయన ప్రయాణించారు. మార్గమధ్యలో ట్రక్కు డ్రైవర్ల ‘మన్‌కీబాత్’ ను తెలుసుకున్నారు. సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి చంఢీగఢ్ వెళ్తున్న ఆయన మార్గమధ్యలో కారు దిగి ట్రక్కులో ప్రయాణం ప్రారంభించడం డ్రైవర్‌లకు ఆశ్చర్యం కలిగించింది. రాహుల్ టీ షర్టు ధరించి ట్రక్కులో డ్రైవర్‌తోపాటు కూర్చుని చేరువ కావడం, ఓ ధాబా దగ్గర డ్రైవర్లతో మాట్లాడడం వీడియోలో కనిపిస్తోంది. అంబాలా చండీగఢ్ జాతీయ రహదారిలో అంబాలా సిటీ లోని గురుద్వారా సమీపాన మంగళవారం తెల్లవారు జామున కాసేపు ఆగి, గురుద్వారాను సందర్శించారు.

“దేశంలో 90 లక్షల మంది ట్రక్కు డ్రైవర్లు ఉన్నారు. వాళ్లకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాహుల్ వారి మన్‌కీబాత్ శ్రద్ధగా విన్నారు. ” అని కాంగ్రెస్ ప్రకటించింది. “ రాహుల్ విలక్షణ మైన వ్యక్తి. సామాన్య ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య విస్తరిస్తున్న “గ్యాప్‌” ను అనుసంధానం చేయడానికి ఆయన అంకితమయ్యారు. ఇంత వేడిలో కూడా రాత్రంతా ట్రక్కు డ్రైవర్లతోపాటు కూర్చుని వారి సమస్యలను తెలుసుకోవడమే కాక, ట్రక్కులోప్రయాణించారు. అలాంటి ప్రజల్లో మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆశ కలిగింది.” అని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం అధినేత సుప్రియా శ్రీనాతే ట్విటర్ ద్వారా హిందీలో వెల్లడించారు. తన తల్లి సోనియాను కలుసుకోడానికి సిమ్లా వెళ్తూ మార్గమధ్యలో ట్రక్కు డ్రైవర్ల సమస్యలను విన్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అంబాలా సిటీ లోని బలదేవ్ నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రామ్‌కుమార్ రాహుల్ పర్యటన గురించి మాట్లాడుతూ మంగళవారం తెల్లవారు జాము 4.30 గంటల ప్రాంతంలో గురుద్వారా మంజీ సాహిబ్ వద్ద రాహుల్ ట్రక్కు దిగి గురుద్వారాలో దర్శనం చేసుకున్నారని చెప్పారు. గురుద్వారా దగ్గర లంగర్‌లో టీ తీసుకున్నారని కుమార్ చెప్పారు. తరువాత ఆయన ట్రక్కుపై చండీగఢ్ వైపు వెళ్లారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News