Wednesday, January 22, 2025

ఈ దేశం పూజారులది కాదు, తాపసులది: రాహుల్ ధ్వజం

- Advertisement -
- Advertisement -

ఈ దేశం పూజారులది కాదు, తాపసులది
ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలపై మరోసారి రాహుల్ ధ్వజం
భయాందోళనలు, విభజనలకు వ్యతిరేకంగా నా యాత్ర
హర్యానాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర

కురుక్షేత్ర: హర్యానాలో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం మరోసారి ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలపై విరుచుకు పడ్డారు. ఉదయం ఆరు గంటలకు తారావాడినుంచి రాహుల్ యాత్ర చేపట్టారు. పొగమంచు,తక్కువ వెలుతురులోనే ఆయన యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌పై ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీ తాపసుల సంస్థ అని, బిజెపి పూజాసంస్థ అని వ్యంగ్యంగా అన్నారు. ఈ దేశం పూజారులది కాదని, తాపసులది( రుషులది) అని ఆయన అన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు తాము చెప్పినట్లుగా పూజలు చేయాలని కోరుకుంటున్నాయని దుయ్యబట్టారు.

‘పూజలు రెండు రకాలు. సాధారణంగా చాలా మంది దేవుడి వద్దకు వెళ్లి పూజలు చేస్తారు. రెండో రకం మోడీ రకం. తమను బలవంతంగా పూజించాలనేది మోడీ రకం. దేశంలో ప్రతి ఒక్కరూ తమను ఆరాధించాలి, తాము చెప్పినట్లుగానే పూజలు చేయాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు అనుకుంటాయి. అలా ఎట్లా కుదురుతుంది. భారత్ జోడో యాత్ర మన దేశంలో వ్యాప్తిచెందుతున్న భయాందోళనలు, మతం,కులం పేరుతో విభజన విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్నది. ఈ ప్రయాణం ఒక తపస్సులాంటిది. ఈ యాత్రవల్ల లాభమో, నష్టమో చెప్పలేను. భయానికి వ్యతిరేకంగా నిలవడం,దేశాన్ని ఏకం చేయడం అనే లక్షాలతో ఈ యాత్ర సాగుతున్నది’ అని రాహుల్ అన్నారు.

ఇక రెండో అంశం ఆర్థిక అసమానత. ఇందులో డబ్బు, మీడియా,ఇతర సంస్థలు కేవలం ముగ్గురు నలుగురు చేతుల్లోనే ఉండి భయంకర నిరుద్యోగాన్ని కలిగిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్నివైపులనుంచి దాడి చేస్తోందని రాహుల్ అన్నారు. రైతులను చంపేందుకు కేంద్రం మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చిందన్నారు. చిన్న వ్యాపారులను దెబ్బతీసేందుకు జిఎస్‌టి, నోట్లరద్దును తీసుకువచ్చారన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇలాంటివి ఉండవన్నారు. రైతులకు రక్షణ ఉంటుందన్నారు.కోటీశ్వరులకు రుణాలను మాఫీ చేసినప్పుడు రైతులకు కూడా చేసి ఉంటే ఎంతో మేలు జరిగి ఉండేదికదా అని అన్నారు. తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు దక్షిణాదిలోకంటే హిందీ మాట్లాడే బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఎక్కువ ఆదరణ లభిస్తోందని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా అన్నారు. ఈ సారి ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ తప్పకుండా జెండా ఎగురవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News