Tuesday, November 5, 2024

బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో విద్వేషం పెరిగింది: రాహుల్

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi slams BJP in Delhi

న్యూఢిల్లీ: బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి దేశంలో విద్వేషం పెరిగిపోతోందని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని, పార్లమెంటులో ప్రజా సమస్యలను లేవనెత్తే వారి గళాన్ని కేంద్రం అణచివేస్తోందని మండిపడ్డారు. మీడియా, ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర వ్యవస్థల పైనా ప్రభుత్వం ఒత్తిడి పెరుగుతోందని, అటువంటివారిపైనా దాడులు చేస్తోందంటూ దుయ్యబట్టారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, జీఎస్టీ పెంపునకు నిరసనగా “మెహంగాయి పర్ హల్లా బోల్” పేరిట ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం నిర్వహించిన సభలో కేంద్రం తీరుపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ దేశాన్ని వెనక్కు తీసుకెళ్తున్నారు. భయం, విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఫలితంగా చైనా, పాకిస్థాన్‌లు వీటి నుంచి ప్రయోజనం పొందుతున్నాయి.

బీజేపీలు, ఆరెస్సెస్‌లు దేశాన్ని విభజిస్తున్నాయి. ధరల పెరుగుదలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, వారిని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజలకు భరోసా కల్పించే కార్యక్రమాలు కరువయ్యాయి. ముఖ్యంగా రైతుల పరిస్థితి దారుణంగా మారింది. అందుకే వారు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్షాలపై ఈడీ, సిబిఐ సంస్థలను ఉసిగొల్పుతోంది. నన్నూ ఈడీ అధికారులు 55 గంటల పాటు వారి కార్యాలయంలో కూర్చోబెట్టారు. ఎన్ని గంటలు ప్రశ్నించినా ఈడీకి భయపడే ప్రసక్తే లేదు” అని వ్యాఖ్యానించారు. యువతను వదిలేసి, ప్రభుత్వం కేవలం బడా వ్యాపారులకే ఉపాధి కల్పిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. రైతుల కోసం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం… అవి కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యాపార వేత్తల ప్రయోజనాల కోసమేనని అన్నారు. కానీ రైతుల ఆందోళనలతో వెనక్కు తగ్గిందన్నారు. ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు, వారి మనసుల్లో ఏముందో అర్థం చేసుకునేందుకే “భారత్ జోడో” యాత్రను చేపడుతున్నట్టు వివరించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలే దేశాన్ని ప్రగతి పథంలో నడిపించగలవని అన్నారు.

Rahul Gandhi slams BJP in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News