న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2021-22 వార్షిక బడ్జెట్ ప్రభుత్వానికి సన్నిహితులైన పెట్టుబడిదారులకు మాత్రమే ఉద్దేశించిందంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బడ్జెట్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఇ) జిఎస్‌టి మినహాయింపులు కాని తక్కువ వడ్డీకి రుణాలు కాని ఇవ్వలేదని, ఇది దేశంలోనే అత్యధికంగా శ్రామికులకు ఉపాధిని కల్పించే ఎంఎస్‌ఎంఇలకు నమ్మకద్రోహం చేయడమేనని రాహుల్ గురువారం ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు.
ప్రధాని మోడీకి సన్నిహితులైన కొందరు బడా పెట్టుబడిదారులకు ఉద్దేశించిన ఈ బడ్జెట్‌లో కుదేలవుతున్న ఎంఎస్‌ఎంఇలకు ఎటువంటి తక్కువ వడ్డీ రుణాలు లేవని, జిఎస్‌టి రాయితీలు లేవని రాహుల్ వ్యాఖ్యానించారు. భారతదేశంలోని అత్యధికంగా కార్మికులకు ఉపాధిని కల్పించే ఎంఎస్‌ఎంఇ పారిశ్రామికవేత్తలకు నమ్మకద్రోహం చేశారంటూ ఆయన ఆరోపించారు. గత సోమవారం పార్లమెంట్‌లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాహుల్ మొదటిసారి స్పందిస్తూ దేశానికి చెందిన ఆస్తులను తనకు సన్నిహితులైన కొద్దిమంది బడా పెట్టుబడిదారులకు అప్పగించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు.
Rahul Gandhi slams Centre Budget 2021-22