టూటికోరిన్ (తమిళనాడు ): చైనా భారత్ సరిహద్దు లోని ప్రతిష్టంభనకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ శనివారం తీవ్రంగా ధ్వజమెత్తారు. తూర్పు పొరుగువారికి ప్రధాని మోడీ భయపడ్డారని విమర్శించారు. తూర్పు లడఖ్‌లో ప్రతిష్టంభనకు ముందు 2017 లో సంభవించిన డోక్లాం దాడిని దృష్టిలో పెట్టుకుని చైనా పరీక్షించిందని, ఆయన వ్యాఖ్యానించారు. అత్యవసరంగా చైనా మనదేశం లోని కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలను ఆక్రమించిందని పేర్కొన్నారు. భారత్ ఏ విధంగా స్పందిస్తుందో చైనా పరీక్షించిందని, భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదని గుర్తించిందని విమర్శించారు. అప్పుడు వారు డోక్లాం ఆలోచనను లడఖ్‌లోను అరుణాప్రదేశ్ లోను అనుసరించారని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. ఆక్రమణలపై భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదని చైనా మొదట గ్రహించిందని, తమను చూసి ప్రధాని భయపడుతున్నారని చైనా గ్రహించిందని వ్యాఖ్యానించారు. ఈ విధమైన సంకేతాన్ని చైనాకు అందించారని విమర్శించారు. అప్పటినుంచి ఇదే ఆలోచనతో చర్చలకు చైనా దిగిందని పేర్కొన్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ మాట్లాడారు.