Wednesday, January 22, 2025

మోడీ మ్యాచ్ ఫిక్సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ మ్యాచ్ పాల్పడుతున్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా 400సీట్ల నినాదం సాధ్యం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంలో బిజెపి మనుషులు ఉన్నారని తీవ్రమైన ఆరోపణ గుప్పించారు. అంపైర్లను ఒత్తిడి చేసి, ఆ టగాళ్లను కొనుగోలు చేసి, కెప్టెన్లను బెదిరించి మ్యాచ్‌లు గెలవడాన్ని క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారని రాహుల్ పేర్కొనారు. ఇవిఎంలు, మ్యా చ్‌ఫిక్సింగ్, సోషల్ మీడియా, ప్రెస్‌పై ఒత్తిడి లేకుం డా బిజెపి 180 సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలవలేద ని తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని అంపైర్లను ఎన్నుకున్నారని, ఈ ఎన్నికల మ్యాచ్‌కి ముందే తమ జట్టు ఆటగాళ్లైన ఇద్దరిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. పేదల నుండి రాజ్యాంగాన్ని లా క్కోవడం కోసం ప్రధాని మోడీ 34 మంది క్రోనీ క్యాపిటలిస్టులను మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ను మనీ ల్యాం డరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్‌ఆద్మీ పార్టీ , ఇండియా కూటమి అగ్రనేతలు ఢిల్లీలో ఆదివారం చేపట్టిన లోక్‌తంత్ర బచా వో ర్యాలీలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

బహిరంగ సభలో సోనియాగాంధీ, ప్రియాంక, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, ఎన్‌సి నేత ఫరూక్ అబ్దుల్లా, శివసేన(యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, వామపక్ష నే తలు ఏచూరీ, డి.రాజా, దీపాంకర్ భట్టాచార్య, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్‌జెడి తేజస్వీ యాదవ్, టిఎంసి నేత డెరెకె ఒబ్రియె న్, ఢిల్లీ ముఖ్యమంత్రి భార్య సునీత, జెఎఎం నేత, మాజీ సిఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సో రెన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అని, కానీ ఎన్నికల ముందు తమ బ్యాంక్ ఖాతాలన్నీమూసివేయబడ్డాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల కోసం తాము ప్రచారాలు నిర్వహించాలని, కార్మికులను రాష్ట్రాలకు తరలించి పోస్టర్లు వేయాలని, కానీ బ్యాంక్ ఖాతాలు మూసివేస్తే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, హేమంత్ సోరేన్‌లను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. ఇప్పుడు వస్తున్న ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని, దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునే చివరి అవకాశమని, స్పష్టం చేశారు. ఒకవేళ పూర్తిస్థాయిలో ఓటు వేయకపోతే వారి మ్యాచ్ ఫిక్సింగ్ ఫలిస్తుందని, అదే జరిగితే రాజ్యాంగం ధ్వంసమవుతుందని రాహుల్ హెచ్చరించారు. రాజ్యాంగం అనేది ప్రజల గొంతుకని, అది నాశనమైతే దేశం అంతమవుతుందని వెల్లడించారు. 400 కి పైగా సీట్లు వస్తే తాము రాజ్యాంగం మారుస్తామని ఓ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను కూడా రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కూటమి ‘విషం’ : ఖర్గే
ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కూటమిని దేశాన్ని ‘నాశనం చేసిన విషం’గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం అభివర్ణించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో అధికార పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ సంఘటితం కావాలని ఖర్గే పిలుపు ఇచ్చారు. ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ‘ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకే’ అనిచెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు తరువాత ‘ప్రజాస్వామ్యానికి ఎదురైన ముప్పు’ను ఎత్తిచూపడం ర్యాలీ లక్షం. కేజ్రీవాల్, సోరెన్ భార్యలు కూడా ర్యాలీకి హాజరై, ప్రసంగాలు కూడా చేశారు. ‘మనం సమైక్యం కావలసిన అగత్యం ఉంది. అప్పుడే మనం బిజెపితో పోరాడగలం. మనం పరస్పరం విమర్శించుకుంటూ, పోరాడుతుంటే కృతకృత్యులం కాలేం’ అని ఖర్గే అన్నారు. ‘ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే. మనం సంఘటితంగా పోరాడాలి’ అని ఖర్గే అన్నారు. మోడీని, ఆయన సిద్ధాంతాన్ని తొలగించనంత వరకు దేశం పురోగమించజాలదనిఖర్గే సూచించారు. ప్రతిపక్షాలను, వాటి నేతలను బెదరించేందుకు సంస్థలను ప్రధాని దుర్వినియోగం చేస్తున్నారని, బిజెపి ప్రభుత్వాల స్థాపన కోసం వాటి ప్రభుత్వాలను కూలుస్తున్నారని కూడా ఖర్గే ఆరోపించారు.

మోడీ ప్రభుత్వం కింద ‘నియంతృత్వం’ : ఉద్ధవ్ థాక్రే
శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాక్కరే ర్యాలీలో మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం కింద దేశం ‘నియంతృత్వం’గా మారిందని ఆరోపించారు. బిజెపికి అధికార చ్యుతి కలిగించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ‘మేము ఇక్కడ ఉన్నది ఎన్నికల ప్రచారానికి కాదు. ప్రజాస్వామ్యపరిరక్షణకే మేము ఇక్కడ ఉన్నాం& ఇది ఏ తరహా ప్రభుత్వం? మీరు ఆరోపణలు చేయండి. ప్రభుత్వం ప్రజలను జైలుకు పంపుతోంది’ అని ఆయన అన్నారు. ‘మన సోదరీమణులు ఇద్దరు పోరాడుతున్నారు. సోదరుడు ఎందుకు వెనుక ఉండాలి? కనుక మనం సోదరీమణులు కల్పనాజీ, సునీతాజీ కోసం ఇక్కడ ఉన్నాం. మేము మాత్రమే కాదు. దేశం మొత్తం మీ వెనుకే ఉంది’ అనిఆయన అన్నారు. ఇడి, సిబిఐ, ఆదాయపు పన్ను శాఖను బిజెపి దుర్వినియోగంచేస్తోందని ఉద్ధవ్ ఆరోపించారు. ఆ మూడు సంస్థలూ తమ మిత్రులు కాదని వారు ప్రకటించాలి అని ఉద్ధవ్ కోరారు.

ఆప్ ఢిల్లీ రాష్ట్ర కన్వీనర్ గోపాల్ రాయ్ మాట్లాడుతూ, దేశ చరిత్రను పలు మార్లు మార్చిన చారిత్రక ప్రదేశం రామ్‌లీలా మైదాన్ అని పేర్కొన్నారు. ‘వారు (బిజెపి) లోక్‌సభ ఎన్నికలలో గెలిచినట్లయితే దేశం పరిణామాలు ఎదుర్కొంటుంది. ఇది మన అందరికీ చావో రేవో పరిస్థితి. మీ పని నుంచి వచ్చే రెండు నెలల పాటు సెలవు తీసుకొని, మన ప్రజాస్వామ్యం పరిరక్షణకు శాయశక్తులా కృషి చేయండి’ అని గోపాల్ రాయ్ సూచించారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీ మాట్లాడుతూ, రానున్న తరాల భవితను, వారు నివసించవలసిన ప్రజాస్వామ్యాన్ని తేల్చేవి ఈ లోక్‌సభ ఎన్నికలని అన్నారు. దేశ జనాభాలో ’50 శాతం’ మహిళలు, తొమ్మిది శాతం ఆదివాసీ జనాభా వాణిగా తాను ర్యాలీకి హాజరయ్యానని కల్పనా సోరెన్ చెప్పారు. ‘మా ఆదివాసీలది పోరాటాల, త్యాగాల సుదీర్ఘ గాథ. మేము మా చరిత్రకు గర్విస్తుంటాం. నియంతృత్వ శక్తులు ప్రజాస్వామ్యంపై దాడికి యత్నిస్తున్నాయనేందుకు ఇక్కడ చేరిన జనం ఒక నిదర్శనం. ప్రజాస్వామ్యంపై దాడిని ఎదుర్కొనేందుకే ఇక్కడ జనం సమీకృతం అయ్యారు’ అని కల్పనా సోరెన్ చెప్పారు.

కేజ్రీవాల్ జైలు నుంచి ప్రకటించిన ఆరు హామీలివే
ఇండియా కూటమి సభలో వెల్లడించిన సునీత
గడిచిన 75 ఏళ్లుగా ఢిల్లీ ప్రజలకు అన్యాయం జరుగుతోందని, ఇండియా కూటమి అధికారం లోకి వస్తే దేశ రాజధానికి పూర్తి స్థాయి రాష్ట్రహోదా కల్పిస్తామని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నట్టు ఆయన సతీమణి సునీత వెల్లడించారు. విపక్ష కూటమి ఆదివారం ఢిల్లీలో చేపట్టిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆమె ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. విద్య, వైద్యంతోపాటు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, విపక్ష కూటమికి అవకాశం కల్పిస్తే గొప్ప దేశాన్ని నిర్మిస్తామని కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు. భారతమాత ఇబ్బందుల్లో ఉందని, ఈ దౌర్జన్యం పనిచేయదని, సునీత అన్నారు. తన భర్తకు దేశ వ్యాప్తంగా ఎంతో మద్దతు లభిస్తోందన్నారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగిన సభలో భావోద్వేగ ప్రసంగం చేసిన సునీత , కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దేశ ప్రజలు కేజ్రీవాల్ తోనే ఉన్నారని, ఆయనను ఎప్పటికీ జైళ్లోనే ఉంచలేరన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పంపిన సందేశం లోని ఆరు గ్యారంటీలను వెల్లడించారు. “ దేశ వ్యాప్తంగా కరెంట్ కోతలు ఉండవు, పేదలకు ఉచిత విద్యుత్ అమలు, సమాజం లోని అన్ని వర్గాల కోసం నాణ్యమైన విద్య అందించేందుకు ప్రతి గ్రామంలో మంచి పాఠశాల, ప్రతి గ్రామం లోనూ మొహల్లా క్లినిక్, ప్రతి జిల్లాకు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, స్వామినాథన్ నివేదిక ఆధారంగా రైతుల పంటలకు కనీస మద్దతు ధర, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా కల్పిస్తాం ” అని కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు. ఐదేళ్లలో ఈ ఐదు హామీలను నెరవేరుస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News