నీట్ పరీక్షలో అక్రమాలు, యుజిసి-నెట్ రద్దుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మానసికంగా కుప్పకూలిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ తరహా ప్రభుత్వాన్ని నడపడానికి అష్టకష్టాలు పడతారని రాహుల్ వ్యాఖ్యానించారు. గురువారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ విద్యా సంస్థలను కబ్జా చేయడమే పేపర్ లీకులకు ప్రధాన కారణమని ఆరోపించారు. ఆ పరిస్థితి మారనంత వరకు ప్రశ్నా పత్రాల లీకులు ఆగబోవని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మోడీ మౌలిక భావనను ప్రతిపక్షాలు ధ్వంసం చేశాయని, వినమ్రంగా ఉండే అటల్ బిహారీ వాజ్‌పేయి లేదా మన్మోహన్ సింగ్ వంటి ప్రధాని ఉండి ఉంటే ప్రభుత్వం మనుగడ సాగించి ఉండేదని రాహుల్ చెప్పారు. ఆసక్తికరమైన రోజులు ముందున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
పార్లమెంట్‌లో తన స్పీకర్ ఉండాలన్న తాపత్రయమే తప్ప నీట్ పరీక్ష కారణంగా వేదనను అనుభవిస్తున్న లక్షలాది మంది వ్యార్థుల గురించి ప్రధాని మోడీకి ఇప్పుడు పట్టదని రాహుల్ విమర్శించారు. ప్రతిపక్షాలు కొట్టిన దెబ్బతకు కుదేలైపోవడం వల్లే ప్రధాని మోడీ మౌనాన్ని ఆశ్రయించారని, ప్రస్తుతం ఆయన అజెండా స్పీకర్ ఎంపిక మాత్రమేనని రాహుల్ ఎద్దేవా చేశారు. నీట్ గురించి ఆయనకు ఏమీ పట్టదని రాహుల్ చెప్పారు. స్పీకర్ పదవి తన పార్టీకే దక్కాలని, తన ప్రభుత్వం గట్టెక్కాలని మాత్రమే మోడీ ఇప్పుడు ఆలోచిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ దృష్టిలో ప్రభుత్వాన్ని నడిపించడమంటే ప్రజలను భయపెట్టి వారి నోళ్లు మూయించడమని, ఇప్పుడు మోడీని చూసి ప్రజలు భయపడే పరిస్థితి లేదని రాహుల్ చెప్పారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని, ఇజ్రాయెల్– గాజా యుద్ధాన్ని ప్రధాని మోడీ ఆపారని చెప్పుకునే వారు. అయితే ఆయనకు(మోడీకి) పరీక్ష పత్రాల లీకులను ఆపడం సాధ్యం కాదా లేక ఆపడం ఇష్టం లేదా అంటూ రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తన భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా పేపర్ లీకుల గురించి వేలాది మంది ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. వ్యాపం కుంభకోణాన్ని దేశమంతటా విస్తరించాలన్న ఆలోచన ఉన్నట్లు కనపడుతోందని బిజెపిని ఉద్దేశించి రాహుల్ ఆరోపించారు. ఏ విషయంపైన ఏకపక్ష నిర్ణయం జరగకూడదని, ఒక ప్రశ్నాపత్రానికి వర్తించే నిబంధన అన్నిటికీ వర్తించాలని ఆయన చెప్పారు. పరీక్షా పత్రాల లీకుల అంశాన్ని ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో లేవనెత్తుతాయని, తగిన చర్యలు తీసుకుని ఉన్నత ప్రమాణాలను నిలబెట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాయని ఆయన తెలిపారు.