న్యూఢిల్లీ : మహా కుంభమేళాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన అనంతరం ప్రతిపక్షాల నిరసనల మధ్య మంగళవారం లోక్‌సభ కొద్ది సేపు వాయిదా పడగా లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఒపి) రాహుల్ గాంధీ స్పందిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎల్‌ఒపిని మాట్లాడనివ్వాలని, కానీ ‘నవ భారతం’లో అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. పార్లమెంట్ వెలుపల విలేకరులతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, మహా కుంభమేళా అంశంపై తాను కూడా మాట్లాడాలని అనుకున్నానని తెలిపారు. జనవరి 29న ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాని మోడీ శ్రద్ధాంజలి ఘటించి ఉండవలసిందని రాహుల్ అన్నారు.
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగిన మహా కుంభమేళా విజయంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిపక్ష సభ్యులు నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో లోక్‌సభను మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొద్ది సేపు వాయిదా వేశారు. ప్రధాని మాట్లాడిన తరువాత ప్రతిపక్ష సభ్యులు అనేక మంది తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ‘ఆయన చెప్పిన విషయాన్ని సమర్ధించాలని అనుకున్నాను. మహా కుంభమేళా మన సంప్రదాయం, చరిత్ర, సంస్కృతి. (మహా కుంభమేళాలో తొక్కిసలాటలో) ప్రాణాలు కోల్పోయినవారికి ఆయన నివాళి అర్పించలేదనే ఫిర్యాదు కూడా ఉంది’ అని రాహుల్ చెప్పారు.
‘కుంభమేళాకు వెళ్లిన యువజనులకు ప్రధాని నుంచి అందవలసింది మరొకటి ఉందని, వారికి ఉపాధి అవసరమని చెప్పాలని అనుకున్నాను. ప్రధాని ఉపాధి కల్పనపై మాట్లాడవలసి ఉంది’ అని రాహుల్ అన్నారు. మిమ్మల్ని మాట్లాడనివ్వలేదా అని అడిగినప్పుడు రాహుల్ సమాధానం ఇస్తూ, ‘మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రకారం, ఎల్‌ఒపిని మాట్లాడనివ్వాలి, కానీ అనుమతి ఇవ్వలేదు, అయితే, ఇది నవ భారతం’ అని చెప్పారు. సభలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వాలని కాంగ్రెస్ వయనాడ్ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ‘ప్రతిపక్షానికి కూడా మనోభావాలు ఉంటాయి. తమ అభిప్రాయాలను వ్యక్తీకరించేందుకు వారికి ఎటువంటి అభ్యంతరాలూ వ్యక్తం కాకూడదు’ అని ప్రియాంక అన్నారు.