Tuesday, December 24, 2024

అది మోడీ సొంత రాజకీయ కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

అయోధ్య ఉత్సవంపై రాహుల్ గాంధీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ సొంత కార్యక్రమమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తన భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనవరి 22న జరగనున్న అయోధ్య రామాలయ ప్రతిష్టాపన మహోత్సవాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కలసి ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాజకీయ కార్యక్రమంగా మార్చివేశాయని ఆరోపించారు. అది ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కార్యక్రమమని, ఈ కారణంగానే ఆ కార్యక్రమానికి హాజరుకాబోమని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటించారని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు.

తాము అన్ని మతాలను, అన్ని సాంప్రదాయాలను గౌరవిస్తామని ఆయన చెప్పారు. అయితే జనవరి 22న జరగిఏ అయోధ్య రామాలయ ఉత్సవాన్ని ఒక రాజకీయ కార్యక్రమంగా భావిస్తున్నట్లు హిందూ మతానికి చెందిన అతిపెద్ద సంస్థలు కూడా బహిరంగంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ చుట్టూ, ఆర్‌ఎస్‌ఎస్ చుట్టూ రూపొందించిన ఈ రాజకీయ కార్యక్రమానికి హాజరుకావడం తమకు ఇబ్బందికరంగా ఉంటుందని ఆయన చెప్పారు. జనవరి 22న అయోధ్యలో జరిగే కార్యక్రమానికి తాము హాజరుకావడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఇదివరకే ప్రకటించారు.

ఎన్నికల్లో లబ్ధి కోసం ఈ ఉత్సవాన్ని ఒక రాజకీయ ప్రాజెక్టుగా బిజెపి మార్చివేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇదిలా ఉంగా మకర సంక్రాంతి పర్వదినాన పవిత్ర సరయు నదిలో పుణ్యస్నానం ఆచరించి అయోధ్యలో ప్రార్థనలు చేయాలన్న తన ప్రణాళికను ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ విభాగం అమలు చేసింది. జనవరి 15వ తేదీన అయోధ్యలోని సరయు నదిలో ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు అజయ్ రాయ్, పార్టీ ఇతర నాయకులు పుణ్యస్నానం ఆచరించారు. కాగా, దీనిపై బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాంగ్రెస్ నాయకులను పచ్చి అవకాశవాదులుగా అభివర్ణించిన బిజెపి రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారని ఆరోపించింది. కాంగ్రెస్ నాయకుల అయోధ్య సందర్శనపై బిజెపి నాయకురాలు, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్పందిస్తూ కాంగ్రెస్ నాయకులను వానలో వచ్చే కప్పలుగా అభివర్ణించారు. రాజకీయాల కోసం వారు ఎంతకైనా దిగజారతారని, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. రాముడిని కాల్పినక పాత్రగా అభివర్ణించిన ఈ నాయకులు ఇప్పుడు మేల్కోన్నారని, ఇప్పటికైనా సరైన మార్గంలో నడుస్తున్నందుకు సంతోషమని ఆమె వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News