Monday, January 20, 2025

దేశమంతా తెలంగాణ మోడల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :దేశమంతా తెలంగాణ మోడల్‌ను అమలు చేస్తామని, తెలంగాణ స్ఫూర్తిని దేశమంతా తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణలో హామీలు నెరవేర్చినట్టుగానే జాతీయ స్థాయిలో కూడా మాట నిలబెట్టుకుంటామని ఆయన పేర్కొన్నా రు. మాజీ సిఎం కెసిఆర్, ప్రధాని మోడీ దొందూ దొందేనని, ఇంటెలిజె న్స్, పోలీసు వ్యవస్థను కెసిఆర్ దుర్వినియోగం చేస్తే మోడీ ఈడీ, సిబిఐలను వాడుకొని అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ వేదికగా లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని కాంగ్రెస్ పూరించింది. ఈ జనజాతర వేదికపై రా హుల్‌గాంధీ న్యాయ పత్రం పేరిట తెలుగు భాషలో కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేశారు.

కాంగ్రెస్ నేషనల్ మేనిఫెస్టోలో తెలంగాణకు సంబంధించిన 23 ప్రత్యేక అంశాలను పొందుపర్చారు. దీంతోపాటు కాంగ్రెస్ ఐదు గ్యారంటీ కార్డును సైతం రాహుల్ వి డుదల చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ గత సిఎం కెసిఆర్ ఎలా పని చేశారో మీకందరికి తెలుసని, కెసిఆర్ వేలాదిమంది ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయించారని  రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు దొరక్కుండా నదుల్లో పడేశారని, బెదిరించి, భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారగానే డేటా మొత్తం ధ్వంసం చేశారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పని మొదలు పెట్టిందని, నిజం మీ ముందుందని రాహుల్ తెలిపారు.

ఇక్కడ కెసిఆర్, కేంద్రంలో ప్రధాని మోడీ..
ఇక్కడ కెసిఆర్ చేసింది, కేంద్రంలో ప్రధాని మోడీ చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుందని, దేశంలోనే బిజెపి అతిపెద్ద వాషింగ్ మెషిన్‌గా మారిందన్నారు. దేశంలోని అతినీతిపరులందరూ మోడీ ముందు నిలుచున్నారన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌లోనూ మోడీ మనుషులు ఉన్నారని, ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందని రాహుల్ ఆరోపించారు. ఈడీ ఎక్స్‌టార్షన్ డైరెక్టరేట్‌గా మారిందన్నారు. ఒక రోజు సిబిఐ ఒక కంపెనీకి ఝలక్ ఇస్తుందని, అదే కంపెనీ మరుసటి రోజు ఎన్నికల బాండ్లు కొంటుందని రాహుల్ అన్నారు.
తెలంగాణ మేనిఫెస్టో ఇక్కడే విడుదల చేశాం
దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణకు సంబంధించిన మేనిఫెస్టోను ఇక్కడే విడుదల చేశామని, అందులో భాగంగా మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు.

త్వరలోనే మరో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, త్వరలోనే మరో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని ఆయన ప్రకటించారు. రూ.500లకు గ్యాస్ ఇచ్చామని, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు. ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా గ్యారంటీల పత్రమన్నారు. కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేని ఫెస్టోలో 5 గ్యారంటీలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇదే తుక్కుగూడలోనే కాంగ్రెస్ గ్యారంటీల కార్డు విడుదల చేశామన్నారు. మేనిఫెస్టోలో అమలు చేయదగ్గ గ్యారంటీలనే ఇచ్చామని రాహుల్ గాంధీ తెలిపారు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. గ్యారంటీలను అమలు చేస్తామన్న విషయం రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు.

ప్రతి మహిళ ఖాతాలోకి రూ.లక్ష నగదు జమ
తెలంగాణలో హామీలు నెరవేర్చినట్లు దేశంలోనూ మాట నిలబెట్టుకుంటామని, దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామని రాహుల్ పేర్కొన్నారు. యువతకు శిక్షణా కార్యక్రమాలు పెట్టబోతున్నామన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజలు నిరుపేదలయ్యారన్నారు. దేశ ప్రజల మనసులోని మాటనే మా మేనిఫెస్టో అని ఆయన తెలిపారు. నారీ న్యాయ్ దేశ ముఖ చిత్రం మారబోతోందన్నారు. ప్రతి మహిళ ఖాతాలోకి రూ.లక్ష నగదు జమ చేస్తామన్నారు. పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టబద్ధత కల్పిస్తామన్నారు. దేశంలో నిత్యం 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మేం అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు.

రైతులకు మోడీ రూపాయి మాఫీ చేయలేదు
ధనవంతులకు మోడీ రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. రైతులకు మాత్రం మోడీ రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం రైతులకు మద్దతు ధర ఇస్తామన్నారు.
దేశంలో 50 శాతం మంది వెనుకబడిన వర్గాలేనని ఆయన తెలిపారు. బడుగుల జానాభా 50 శాతం ఉంటే ఆదాయం 5 శాతమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనాలు కల్పిస్తామని రాహుల్ హామినిచ్చారు.
బిజెపి దగ్గర డబ్బుంది, మా దగ్గర ప్రేమ ఉంది
బిజెపి దగ్గర డబ్బుంది, మా దగ్గర ప్రేమ ఉందని రాహుల్ పేర్కొన్నారు. బిజెపికి డబ్బు ఇచ్చిన కంపెనీలకే కాంట్రాక్టులు దక్కాయని, బిజెపి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోందని రాహుల్ ఆరోపించారు. తాము రాజ్యాంగాన్ని రద్దు చేయమని, మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. మా మేనిఫెస్టో దేశ ముఖ చిత్రాన్ని మార్చబోతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారని, రైతులు, వెనుకబడిన వారికి మరో 5 హామీలు ఇచ్చామని రాహుల్ తెలిపారు.

రాహుల్‌కు స్వాగతం పలికిన సిఎం
తుక్కుగూడ జనజాతర సభ కోసం రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ వద్ద ఆయనకు సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి తుక్కుగూడ జనజాతర సభా ప్రాంగణానికి రాహుల్‌గాంధీని సిఎం రేవంత్ తోడ్కొని వెళ్లారు. ఈ నేపథ్యంలోనే భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సభా ప్రాంగణానికి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రచిస్తుండగా అందులో భాగంగా తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ముందుగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులు మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News