Wednesday, November 6, 2024

మీ చర్యలతో మా యాత్రకే లబ్ధి: రాహుల్

- Advertisement -
- Advertisement -

గువాహటి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చర్యలతో తమ పార్టీకి విశేష ప్రచారం దక్కుతోందని, తద్వారా భారత్ జోడో న్యాయ యాత్రకు లబ్ధి చేకూరుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మంగళవారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అస్సాంలో ఇప్పుడు న్యాయ యాత్ర ప్రధాన అంశంగా మారిందని ఆయన చెప్పారు. ఆలయంలోకి, యూనవర్సిటీలోకి ప్రవేశించకుండా తనను అడ్డుకోవడం, తన పాదయాత్రను నిరోధించడం వంటివి వేధింపు చర్యలని, ఇటువంటి వేధింపులకు తాము బెదిరేది లేదని రాహుల్ తెలిపారు. భాగస్వామ్యం, యువతకు, కార్మికులకు, మహిళలకు, రైతులకు న్యాయం లభించడం వల్ల దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ఆయన అన్నారు.

రాహుల్‌పై కేసు నమోదుకు సిఎం ఆదేశం

కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా మంగళవారం గువాహటిలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చెలరేగింది. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టినందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయవలసిందిగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర డిజిపిని ఆదేశించారు. రాహుల్ గాంధీ యాత్ర నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర నిరసన తెలిపారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు సాగకుండా పోలీసులు బలప్రయోగం చేశారు. ట్రాఫిక్ జాంలు ఏర్పడకుండా నివారించడానికి యాత్రను నగరంలోకి అనుమతించబోమని అంతకుముందు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఖానాపారాలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని రాహుల్ గాంధీకి డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. బారికేడ్లను పగులగొట్టి తాము విజయం సాధించామంటూ అస్సాం కాంగ్రెస్ ఇన్‌చార్జ్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. సోమవారం మేఘాలయాలోకి ప్రవేశించిన న్యాయ యాత్ర చివరి విడతగా అస్సాంలోకి మంగళవారం తిరిగి ప్రవేశించి గువాహటి నగర శివార్ల మీదుగా ప్రయాణిస్తుంది. అస్సాంలో గురువారం వరకు న్యాయ యాత్ర కొనసాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News