Monday, December 23, 2024

అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్

- Advertisement -
- Advertisement -

కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం
చూపుతాం నోట్ల రద్దుతో సామాన్యుల నడ్డివిరిచిన మోడీ
కేంద్ర సర్కారుపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
తెలంగాణలో తిరిగి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర

మన తెలంగాణ/హైదరాబాద్: రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఎగరబోయేది కాంగ్రెస్ జెండాయేనని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో భాగంగా నారాయణపేట జిల్లా ఎలిగండ్ల వద్ద ఏర్పాటు సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. నోట్ల రద్దు విషయంలో బిజెపి చేసిన తప్పిదం వల్ల చిన్నా, చితకా వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్‌ను అమలు చేస్తామన్నారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఆర్ధిక సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కౌలు రైతుల సమస్యలకు కూడా పరిష్కారం చూపుతామన్నారు. 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం చిన్నవిషయం కాదని, కానీ దేశప్రజల మమకారం ముందు ఇది చిన్నబోయిందని, ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. టిఆర్‌ఎస్, బిజెపిలు రెండూ ఒకటేనని, నాణేలకు రెండువైపులా ఉన్న పార్టీలే అన్నారు. పార్లమెంట్‌లో బిజెపి ఏ బిల్లు పెట్టినా తూచా తప్పకుండా టిఆర్‌ఎస్ మద్ధతు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. రైతు వ్యతిరేక చట్టాలకు టిఆర్‌ఎస్ మద్ధతు ఇచ్చిందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. టిఆర్‌ఎస్, బిజెపి రెండూ ఒక్కటేనని ఆయన ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్ సమదూరం పాటిస్తుందని రాహుల్ స్పష్టం చేశారు. బిజెపి, టిఆర్‌ఎస్ రెండూ అంటకాగుతున్నాయని, రెండు పార్టీలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. రెండు పార్టీలు శాసనసభ్యులను కొనుగోలు చేస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టించాయని, టిఆర్‌ఎస్ పార్టీ మియాపూర్ లాండ్ స్కామ్‌కు పాల్పడిందని రాహుల్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై రైతులు, సామాన్యులు పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారని.. టిఆర్‌ఎస్, బిజెపి రెండూ ప్రజా సంక్షేమాన్ని చూడకుండా వారి సొమ్ము దోచుకుంటోందని, నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరుగుతోందని ఆరోపించారు. నోట్ల రద్దు, జిఎస్‌టి నిర్ణయాలతో పేదలు, సామాన్యులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉపాధి, ఉద్యోగాల కోసం యువత ఎదురుచూస్తోందని రాహుల్ అన్నారు. నిరుద్యోగం, పెట్రోలు, గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను ఎలుగెత్తి చాటడానికే జోడో యాత్ర చేపట్టానని రాహుల్ తెలిపారు. అంతకుముందు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు, కౌలు రైతులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి రైతులు రాహుల్ గాంధీతో సమావేశానికి హాజరయ్యారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై తమ పార్టీ ఒత్తిడి తీసుకువస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
మఖ్తల్ నుంచి ఎలిగండ్ల వరకు కొనసాగిన పాదయాత్ర….
ఎఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపడుతున్న భారత్ జోడో యాత్ర…తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత…మూడురోజుల విరామం అనంతరం గురువారం మఖ్తల్ నుంచి తిరిగి పాదయాత్ర కొనసాగింది. దీపావళి పండుగతోపాటు మల్లిఖార్జున ఖర్గే ప్రమాణస్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీ…గురువారం గుడెబల్లూర్ వద్ద బసచేసిన శిబిరం నుంచి ఉదయం 6 గంటలకు వాహనంలో బయల్దేరి మఖ్తల్ సబ్ స్టేషన్ వద్దకు సుమారు 6.15 కు చేరుకున్నారు. మఖ్తల్ సబ్ స్టేషన్ నుంచి 6.15 గంటలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క, డిసిసి అధ్యక్షుడు వాకిటి శ్రీహరి, ప్రశాంత్ కుమార్ రెడ్డిలతో కలిసి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు. మఖ్తల్ పట్టణంలోని జాతీయరహదారి గుండా ఉత్సాహంగా నడుచుకుంటూ వెళ్లారు. మఖ్తల్ లో పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ, ముందుకు కదిలారు. పెద్దఎత్తున సాంస్కృతిక కళాకారులు, నృత్యాలు చేస్తున్న వారితో పాదయాత్ర సందడిగా మారింది. దాదాపు 6.30 గంటల ప్రాంతంలో మఖ్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్దకు చేరుకోగా…6.45 గంటలకు పట్టణ శివారులోని నల్లజానమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఇక పెద్దచెరువు మీదుగా ముందుకు కదిలారు. ఇందులో బాగంగా పాదయాత్రలో పాల్గొంటున్న డప్పువాయిద్య కళాకారులతో కలిసి ఉత్సాహంగా డప్పు వాయించారు. దీంతో పాదయాత్రలో నేతలు, కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. దాదాపు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కాచ్ వార్ దాటి…బొందల్ కుంట సమీపంలో ఏర్పాటుచేసిన విశ్రాంతి శిబరం వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత టిఫిన్ తోపాటు లంచ్ సైతం అక్కడే చేసిన రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకున్నారు.

Rahul Gandhi speech in Narayanpet District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News