Wednesday, January 22, 2025

దేశంలో పరీక్షల వ్యవస్థలోనే పెద్ద సమస్య: రాహుల్ విమర్శ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రశ్న పత్రాల లీక్‌పై లోక్‌సభలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతిపక్షాలు తూర్పారబట్టాయి. దేశంలో పరీక్షల వ్యవస్థలో అత్యంత తీవ్ర సమస్య ఉందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ ఆరోపించారు. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనను మినహాయించి ప్రతి ఒక్కరినీ నిందిస్తున్నారని రాహుల్ విమర్శించారు. ప్రతిపక్షాల విమర్శలకు గురైన ప్రధాన్ తాను ‘మా నేత ప్రధాని దయ వల్లే ఇక్కడ’ ఉన్నానని, తమ ప్రభుత్వం ఉమ్మడిగా జవాబుదారీ అని స్పష్టం చేశారు. గడచిన ఏడు సంవత్సరాల్లో ప్రశ్న పత్రాలు లీక్ అయినట్లుగా ఎక్కడా దాఖలాలు లేవని కూడా మంత్రి సుస్పష్టం చేశారు. ప్రశ్న పత్రాల లీక్‌ల సమస్యపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుండడంతో స్పీకర్ ఓమ్ బిర్లా కల్పించుకుంటూ, అన్ని పరీక్షల గురించి ప్రశ్నలు లేవనెత్తడం సరి కాదని, మెరుగైన పరీక్ష వ్యవస్థ రూపకల్పనపై సభ్యులు చర్చించాలని సూచించారు.

నీట్ ప్రవేశ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై దర్యాప్తు సాగిస్తున్న సిబిఐ ఆరు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎంబిబిఎస్, బిడిఎస్, ఆయుష్, ఇతర సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టిఎ) నీట్ యుజి నిర్వహిస్తున్నది. దేశంలో నీట్‌లోనే కాకుండా అన్ని ప్రధాన పరీక్షలకు సంబంధించి పరీక్షల వ్యవస్థలో అత్యంత తీవ్ర సమస్య ఉందన్నది కాదనలేమని రాహుల్ గాంధీ అన్నారు. ‘మంత్రి తనను తప్ప ప్రతి ఒక్కరినీ నిందించారు. ఇక్కడ జరుగుతున్నదేమిటో ప్రాథమిక అంశాలను ఆయన అర్థం చేసుకున్నారని నేను భావించడం లేదు. ఈ సమస్య దేశంలోని లక్షలాది విద్యార్థులకు సంబంధించినది. జరుగుతున్నదాని గురించి వారు ఆందోళన చెందుతున్నారు. భారతీయ విద్యా వ్యవస్థ మోసపూరితం అని వారు నమ్ముతున్నారు’ అని రాహుల్ ఆరోపించారు. ‘మీరు సంపన్నులైతే, డబ్బు ఉన్నవారైతే భారతీయ విద్యా వ్యవస్థను కొనగలరు’ అని కూడా రాహుల్ ఆరోపించారు.

‘ఇది వ్యవస్థకు సంబంధించిన సమస్య కనుక ఆ స్థాయిలో సమస్య పరిష్కారానికి మీరు ఏమి చేస్తున్నారు?’ అని ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానాలు ఇస్తున్న ప్రధాన్‌ను అడిగారు. పరీక్షల వ్యవస్థే చెత్త అని అభివర్ణించడం శోచనీయం అని ప్రధాన్ అన్నారు. ఏడు సంవత్సరాల్లో 70 పేపర్ లీక్‌లు జరిగాయని కాంగ్రెస్ సభ్యుడు మాణిక్కం ఠాగూర్ ప్రస్తావించగా మంత్రి ప్రధాన్ సమాధానం ఇస్తూ, ‘గడచిన ఏడు సంవత్సరాల్లో ఏ గణాంకాల్లోనైనా పేపర్ లీక్‌లు ఉన్నట్లుగా దాఖలాలు లేవు’ అని చెప్పారు. ఎన్‌టిఎ ఏర్పాటైనప్పటి నుంచి 240 పైగా పరీక్షలు నిర్వహించినట్లు, ఐదు కోట్ల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసినట్లు, నాలుగున్నర కోట్ల మందికి పైగా విద్యార్థులు హాజరైనట్లు మంత్రి తెలియజేశారు. లోపాలు. అక్రమాల ఆరోపణలకు సంబంధించి ‘మేము ఏదీ దాచడం లేదు& ప్రతిదీ రికార్డు అయి ఉంది’ అని ప్రధాన్ చెప్పారు. ఈ అంశంపై నిర్మాణాత్మక చర్చ జరగాలని స్పీకర్ నొక్కిచెప్పారు.

దేశంలోని పరీక్షల వ్యవస్థ గురించి ప్రశ్నలు లేవనెత్తితే ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యా వ్యవస్థపైన, ఉద్దేశాలపైన ప్రభావం పడుతుందని స్పీకర్ అన్నారు. స్పీకర్ తన వ్యాఖ్యలు ముగించిన తరువాత రాహుల్ మాట్లాడాలని అనుకున్నారు. కాని ఆయనను అనుమతించలేదు. రాహుల్ గాంధీ, టిఎంసి, డిఎంకె సహా దాదాపు ప్రతిపక్షాల సభ్యులు అందరూ సభలో నుంచి వాకౌట్ చేశారు. ప్రధాన్ రాజీనామా కోరుతూ సభలోని కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ నినాదాలు చేశారు. ప్రశ్న పత్రాల లీక్‌ల గురించి ఎస్‌పి నేత అఖిలేశ్ యాదవ్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ అంశాన్ని ప్రభుత్వం నమోదు చేస్తుందని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 19న మరణించిన వియత్నాం అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్‌గుయెన్ ఫు త్రాంగ్‌కు సభ నివాళులు అర్పించింది. ఫు త్రాంగ్ పట్ల గౌరవ సూచకంగా సభ్యులు కొద్ది సేపు మౌనంగా నిలబడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News