Wednesday, January 22, 2025

గిగ్ వర్కర్ల దుస్థితి వర్ణనాతీతం:రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గిగ్ వర్కర్ల దుస్థితిని సోమవారం ప్రధానంగా ప్రస్తావించారు. వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పటిష్ఠ విధానాలు రూపొందిస్తాయని, దేశవ్యాప్తంగా వాటి అమలుకు ఇండియా కూటమి పాటుపడుతుందని రాహుల్ హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల ఉబెర్ క్యాబ్‌లో ప్రయాణించి, డ్రైవర్‌తో ముచ్చటించినప్పటి వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ‘తక్కువ ఆదాయం, ద్రవ్యోల్బణం వారి జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. ఇది భారత్‌లోని గిగ్ వర్కర్ల దుస్థితి. ఉబెర్ ప్రయాణంలో సునీల్ ఉపాధ్యాయ్‌జీతో చర్చ, అతని కుటుంబంతో సమావేశం తరువాత దేశంలో క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్లు వంటి గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నా’ అని రాహుల్ ‘ఎక్స్’లో హిందీ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘వారు కనాకష్టంగా జీవిస్తున్నారు&. పొదుపులు లేవు, కుటుంబ భవితకు పునాది లేదు. వీటి పరిష్కారానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ విధానాల రూపకల్పన ద్వారా న్యాయంచేస్తాయి’ అని ఆయన తెలిపారు.

ఇండియా కూటమి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా వాటి అమలు జరిగేలా చూస్తుందని రాహుల్ హామీ ఇచ్చారు. ఉబెర్ యాప్ ద్వారా ఒక ట్యాక్సీ బుక్ చేసుకున్న తరువాత రాహుల్ ఒక క్యాబ్‌లో ప్రయాణం చేయడం 11 నిమిషాలపైగా సాగిన ఆ వీడియోలో కనిపించింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఉటాకు చెందిన క్యాబ్ డ్రైవర్‌తో ఆయన ముఖాముఖి సాగించి, అతని సమస్యల గురించి అడిగారు. సామాజిక భద్రత లేకుండా, డ్రైవర్లకు స్వల్ప రేట్లతో బొటాబొటీ నిధులతో జీవనం సాగిస్తున్నానని రాహుల్‌తో క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. ఢిల్లీలో రోజులు గడవడం కష్టంగా ఉంటుండడంతో స్వగ్రామానికి వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నానని కూడా అతను చెప్పాడు. రాహుల్ ఆ ప్రయాణం ముగించి, క్యాబ్ డ్రైవర్ పిల్లలకు ఒక కానుక అందజేశారు. ఆ ప్రయాణం మరునాడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక ఫలహారశాలలో క్యాబ్ డ్రైవర్ కుటుంబంతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు గిగ్ వర్కర్ల గురించి ఆలోచిస్తున్నాయని ఆయన భరోసా ఇచ్చారు. డ్రైవర్లకు, వారి కుటుంబాలకు సామాజిక భద్రత చేకూరేలా చూడాలని తాను అనుకుంటున్నట్లు రాహుల్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News