న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం దేశ రాజధానిలో అడ్డా కూలీలను కలుసుకుని వారి కష్టసుఖాలను పంచుకున్నారు. అడ్డా కూలీలకు సంపూర్ణ హక్కులను కల్పించి వారికి తగిన గౌరవం అందించడమే తన జీవిత లక్షమని రాహుల్ ప్రకటించారు. ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ నగర్‌లో కూలీలను కలుసుకున్న రాహుల్ వారిని పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అంతేగాక వారితో కలసి భవన నిర్మాణ పనులలో పాలుపంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన వాట్సాప్ చానల్‌లో షేర్ చేసిన రాహుల్ భారతదేశంలో నేడు కూలీలకు, శ్రామికులకు గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా తాను ఇదే విషయం చెప్పానని, అయితే నిత్యం పనుల కోసం జిటిబి నగర్‌లో వేచి ఉండే అడ్డా కూలీలను కలుసుకున్న తర్వాత తనకు ఈ విషయం ధ్రువీకరణ అయిందని ఆయన పేర్కొన్నారు.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా వారు వచ్చే కొద్దిపాటి వేతనంతో అర్ధాకలితో జీవిస్తున్నారని, ఆ ఆదాయానికి కూడా భరోసా లేదని రాహుల్ తెలిపారు. కష్టజీవులైన ఈ కార్మికులే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా పేర్కొంది. రాహుల్ గాంధీ కార్మికులతో మాట్లాడుతున్న ఫోటోలను షేర్ చేసిన కాంగ్రెస్ కార్మికుల జీవితాలకు, వారి భవిష్యత్తుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనపైన ఉందని కాంగ్రెస్ పేర్కొంది.