న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. పేదలు ప్రయాణించే భారతీయ రైల్వేలోని అన్ని తరగతుల చార్జీలు పెరిగిపోయాయని, వృద్ధులకు అందచే చార్జీల రాయితీని కూడా ప్రభుత్వం ఉపసంహరించిందని రాహుల్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విమర్శించారు. ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచేశారని, ప్రైవేటీకరణకు తలుపులు తెరిచారని ఆయన పేర్కొన్నారు. ప్రజల నుంచి పిండిన ఈ డబ్బు సెల్ఫీ స్టాండ్ కోసమా? సభారతదేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? చవకగా గ్యాస్ సిలిండర్లు..సులభతర రైలు ప్రయాణమా? లేక షహెన్షా(రాజు) విగ్రహంతో సెల్ఫీనా? అంటూ రాహుల్ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాగా..రైల్వే స్టేషన్లలో సెల్ఫీలు బూత్‌లు ఏర్పాటు చేసి అందులో మోడీ ఫోటోలతో సెల్ఫీలు దిగడం ప్రజాధనం దుర్వినియోగం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో రాహుల్ నుంచి నేడు ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రతిపక్ష రాష్ట్రాలు ఒకపక్క ఉపాధి హామీ పథకం నిధుల కోసం ఎదురుచూస్తుంటే మరోపక్క కేంద్రం ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినయోగం చేస్తోందని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ రైల్వే పరిధిలో రైల్వే స్టేషన్లలో ఏర్పాటుచేసిన తాత్కాలిక, శాశ్వత సెల్ఫీ బూత్‌ల జాబితాను సమాచార హక్కు చట్టం కింద ఖర్గే సేకరించారు. ఆ రైల్వే స్టేషన్ల జాబితాను కూడా ఆయన బయటపెట్టారు.