Sunday, December 22, 2024

రాహుల్ సారథ్యంలోనే కాంగ్రెస్ బలోపేతం

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi to become Cong chief Says Gehlot

అశోక్ గెహ్లాట్ ఉద్ఘాటన

కన్యాకుమారి(తమిళనాడు): కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టాలని, ఆయన సారథ్యంలోనే పార్టీ ఐకమత్యంగా ఉండి సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో యాత్ర ప్రారంభానికి ముందు బుధవారం నాడిక్కడ గెహ్లాట్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం గాంధీ కుటుంబానికి ఉన్న అతి గొప్ప లక్షణమని అన్నారు. రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ప్రతి కార్యకర్త కోరుకోవడానికి కారణం ఆయన అధ్యక్షుడిగా ఉంటేనే పార్టీ ఐకమత్యంగా ఉంటుందని ఆయన అన్నారు. 2019లో ఎన్నికల్లో పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని, అయితే పార్టీ ఆదేశాల మేరకు తాను పనిచేస్తానని ఆయన సిడబ్లుసిలో చెప్పారని గెహ్లాట్ గుర్తు చేశారు.

తాము మాత్రం రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నామని, ఆయన సారథ్యంలో పార్టీ మరింత బలోపేతమై దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలదని ఆయన గెహ్లాట్ పేర్కొన్నారు. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం చేసిన సేవలను ఆయన కీర్తిస్తూ గడచిన 30 ఏళ్లుగా గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించలేదని చెప్పారు. ఆ అవకాశం ఆ కుటుంబానికి రాక కాదని, తనకు వచ్చిన అవకాశాన్ని సోనియా గాంధీ వదులుకుని ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను నియమించారని ఆయన గుర్తు చేశారు. ముక్కచెక్కలవుతున్న పార్టీని సమైక్యపరచడానికే సోనియా రాజకీయాల్లోకి వచ్చారని ఆయన తెలిపారు. కాగా..రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టని పక్షంలో ఆ పదవిని ఆశిస్తున్న వారిలో అశోక్ గెహ్లాట్ ముందంజలో ఉన్నారని ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో ఆయన నుంచే రాహుల్ నాయకత్వానికి మద్దతుగా ప్రకటన వెలువడడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News