సుల్తాన్‌పూర్(యుపి): పరువునష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఇక్కడి ఎంపి-ఎమ్మెల్యే కోర్గులో హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చవకబారు ప్రచారం కోసమే ఈ కేసును దాఖలు చేశారని రాహుల్ ఆరోపించారు. పరువునష్టం కేసుకు దారితీసే విధంగా తాను ఎవరిపైన ఎటువంటి ప్రకటన చేయలదేని ప్రత్యేక న్యాయమూర్తి శుభం వర్మ ఎదుట హాజరైన రాహుల్ గాంధీ తెలియచేశారని ఆయన తరఫు న్యాయవాది ప్రసాద్ శుక్లా విలేకరులకు తెలిపారు.
2018 ఆగస్టు 4న స్థానిక బిజెపి నాయకుడు విజయ్ మిశ్రా ఈ కేసు దాఖలు చేశారు. అప్పటి బిజెపి అధ్యక్షుడు, ఇప్పటి హోం మంత్రి అమిత్ షాపైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్‌పై విజయ్ మిశ్రా ఆరోపించారు. ఈ కేసు విచారణ ఆగస్టు 12న జరుగుతుందని ప్రత్యేక న్యాయమూర్తి తెలిపారు. ఆ రోజు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కానవసరం లేదని, పిటిషనర్ విజయ్ మిశ్రా వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నమోదు చేస్తారని న్యాయవాది తెలిపారు. రాహుల్ గాంధీన తన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఇచ్చారని, ఆగస్టు 12న సాక్ష్యాలను సమర్పిస్తామని మిశ్రా తరఫు న్యాయవాది సంతోష్ కుమార్ పాండే తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 20న రాహుల్ గాంధీ తన భారత్ జోడో న్యాయ యాత్రను అమేథీలో నిలిపి కోర్టుకు హాజరుకాగా ఆయనకు బెయిల్ మంజూరైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీ కోర్టు వద్దకు చేరుకోగా ఆయనను చూసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు తరలివచ్చారు. 13వ నంబర్ కోర్లు ప్రత్యేక జడ్జి ముందు హాజరై వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం రాహుల్ కోర్టు నుంచి వెళ్లిపోయారు. భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది కోర్టు వద్ద మోహరించడంతో ఆ కోర్టు ప్రాంగణం ఒక కోటను తలపించింది. రాయబరేలి నుంచి లోక్‌సభకు ఎన్నికైన రాహుల్ విమానంలో లక్నో చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుల్తాన్‌పూర్‌కు వచ్చారు.