లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు యుఎస్‌లో పర్యటించనున్నారు. రాహుల్ వాషింగ్టన్ డిసి, డల్లాస్, టెక్సాస్ విశ్వవిద్యాలయంలో పలు ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొంటారు. జూన్‌లో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుని బాధ్యతలు చేపట్టిన తరువాత రాహుల్ యుఎస్‌లో జరపనున్న తొలి పర్యటన వివరాలను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా తెలియజేశారు. ‘రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు అయినప్పటి నుంచి ఆయనతో ముఖాముఖి గురించి భారత సంతతి ప్రజలు, దౌత్యాధికారులు, విద్యావేత్తలు, వాణిజ్య ప్రముఖులు, నేతలు, అంతర్జాతీయ మీడియా, ఇతరులు అనేక మంది నుంచి 32 దేశాల్లో ఉనికి ఉన్న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్‌గా తనకు
పుంఖాను పుంఖంగా అభ్యర్థనలు వస్తున్నాయి’ అని పిట్రోడా ఒక వీడియో ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు ఆయన (రాహుల్) అత్యల్ప పర్యటనపై యుఎస్‌కు వస్తున్నారని, ఆయన సెప్టెంబర్ 8న డల్లాస్, 9, 10 తేదీల్లో వాషింగ్టన్ డిసి సందర్శిస్తారని పిట్రోడా తెలిపారు. డల్లాస్‌లో టెక్సాస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, విద్యా సంస్థలు, ఇతర ప్రజలతో ముఖాముఖి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలపై జనానికి ఆసక్తి ఉన్నందున రకరకాల వ్యక్తులతో పలు కార్యక్రమాలు తలపెట్టామని ఆయన తెలియజేశారు. రాహుల్ పర్యటన విజయవంతం అవుతుందని తాము ఆశిస్తున్నామని పిట్రోడా తెలిపారు.