కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జూన్ 12న కేరళలోని వయనాడ్‌ను సందర్శించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సోమవారం తెలిపాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వయనాడ్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండవసారి విజయం సాధించిన రాహుల్ గాంధీ తన సమీప ప్రత్యర్థి, సిపిఐ అభ్యర్థి అన్నీ రాజాను 3,64,422 ఓట్ల తేడాతో ఓడించారు. గెలుపొందిన తర్వాత మొదటిసారి వయనాడ్‌ను రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. ఈ స్థానాన్ని వదులుకుని తాను గెలుపొందిన మరో స్థానమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని
కాంగ్రెస్ కంచుకోట రాయబరేలిలో కొనసాగుతారని ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో రాహుల్ వయనాడ్ సందర్శన ప్రాధాన్యతను సంతరించుకుంది. జూన్ 12న రాష్ట్ర అసెంబ్లీకి నిరిసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించిన ప్రతిపక్ష యుడిఎఫ్ రాహుల్ గాంధీ సందర్శనను పురస్కరించుకుని తన కార్యక్రమాన్ని వాయిదా వేసింది. బార్ యజమానులకు అనుకూలంగా లిక్కర్ పాలసీని మార్చాలని కేరళలోని పినచయి ప్రభుత్వం నిర్ణయించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష యుడిఎఫ్ గత నెలలోనే ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది.