రాయ్‌పూర్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఛత్తీస్‌గఢ్‌లో కొద్ది సేపు రైలులో ప్రయాణం చేశారు. బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వరకూ ఆయన ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్‌లో ఇతర ప్రయాణికులు, ప్రత్యేకించి కాలేజీ విద్యార్థినులు , యువతతో మాట్లాడుతూ సాగారు. కొద్ది సేపు ఆయన అందరూ అమ్మాయిలతో కలిసి కూర్చుని మాట్లాడారు. వారితో కలిసి సెల్‌ఫోన్ ఫోటోలు దిగారు. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న దశలో ఇంతకు ముందు రైల్వే కూలీగా అవతారం ఎత్తిన రాహుల్ ఇప్పుడు ప్రయాణికుడు అయ్యారు.
ఇప్పుడు రైలులో ఆయన పర్యటన సందర్భంగా వెంబడి ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుమారీ సెల్జా, పిసిసి అధ్యక్షులు దీపక్ బైజీ ఉన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తరచూ వందేభారత్ రైళ్లు, రైల్వేల మరింత ఆధునీకరణ అంటోందని, అయితే గత కొద్ది నెలల కాలంలోనే రాష్ట్రం మీదుగా వెళ్లే దాదాపు 2600 రైళ్లు రద్దు చేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. ఈ వాదనను బలోపేతం చేస్తూ ఈ రైలులో ప్రయాణించిన రాహుల్ సగటు రైలు ప్రయాణికుల కష్టాల గురించి ఈ సందర్భంగా తెలుసుకున్నారు.