ప్రధానికి రాహుల్ చురక
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ల కొరతతీర్చే బాధ్యతను ప్రధాని మోడీ నిర్వర్తించాల్సి ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచించారు. ప్రతి పౌరుడికి టీకాలు అందాల్సి ఉంది. వ్యాక్సినేషన్ అత్యంత కీలకమైనది, దీనిని నిర్వహించలేకపోవడానికి సాకులు చెప్పవద్దని మోడీకి చురక పెట్టారు. ఆదివారం నాటి ప్రధాని మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ వ్యాక్సిన్ తటపటాయింపుల గురించి ప్రస్తావించిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. ముందు టీకాల కొరత తీర్చండి, టీకాల విషయంలో ప్రజలు వెనుకముందులాడుతున్నారని చెప్పడం ఎందుకు? అసలు విషయాన్ని వెలుగులోకి రాకుండా చేసేందుకా? ఇటువంటి సాకులు ఎంతకాలం చెపుతారు? అని రాహుల్ నిలదీశారు. ముందు వ్యాక్సిన్లు అందరికీ అందేలా చేయండి తరువాత ప్రధాని తమ మన్ కీ బాత్ సాగించవచ్చు అని చమత్కరించారు. ప్రజలు మీమాంసలో ఉన్నారని దొరకని వాటి గురించి చెప్పడం ప్రధానికి, ఆయన మన్ కీ బాత్‌కే చెల్లుతుందన్నారు.