Wednesday, January 22, 2025

ఉద్రిక్తత నడుమ మణిపూర్‌లో రాహుల్

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ గురువారం మణిపూర్‌లో ఉద్విగ్న పరిణామాల నడుమ పర్యటించారు. తెగల మధ్య ఘర్షణలతో రగిలిపోతున్న మణిపూర్‌లోని ఉద్రిక్తతల కేంద్రం చురాచాంద్‌పూర్‌లో ఆయన సహాయక శిబిరానికి వెళ్లి నిర్వాసితులను పరామర్శించారు. అనుకున్న సమయానికి పలు గంటల ఆలస్యంగా ఆయన ఈ క్యాంప్ చేరుకోవల్సి వచ్చింది. శాంతిభద్రతల పరిస్థితి , గ్రనేడ్ దాడుల భయాలు ఉన్నందున రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను ముందుకు వెళ్లకుండా అంతకు ముందు రాష్ట్ర పోలీసు బృందాలు మధ్యలోనే అడ్డుకున్నాయి. దీనితో అధికారులకు , రాహుల్‌కు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.

అయితే ఈ ప్రాంతం వివాదానికి కేంద్ర బిందువుగా ఉందని, ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో అక్కడికి నేతలను పంపించడం బాధ్యతారాహిత్యం అవుతుందని అధికారులు తెలిపారు.ఇంఫాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని బిష్ణుపూర్ వద్ద రాహుల్‌ను నిలిపివేశారు. కాన్వాయ్‌పై దాడి జరిగితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. క్యాంప్ సందర్శనకు వెళ్లాలనుకుంటే హెలికాప్టర్ బెటర్ అని తెలిపారు. తరువాత ఆయన ఇంఫాల్‌కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా చురాచంద్‌పూర్ వెళ్లారు. రాహుల్ వెంబడి రాష్ట్ర పోలీసు , అత్యున్నత స్థాయి అధికారులు వెంటవెళ్లారని ఎయిర్‌పోర్టులో కొందరు తెలిపారు. రాహుల్ గాంధీని ఎందుకు అడ్డగిస్తున్నారని నిరసిస్తూ బిష్ణుపూర్‌లో కొందరు ధర్నాలకు దిగారు. మరికొందరు ఆయనను అనుమించరాదని పట్టుపట్టారు.

ఈ దశలో ఉద్రిక్తత నెలకొంది. గుంపులు మరింతగా చేరకుండా పోలీసులు ముందు హెచ్చరికలు వెలువరించి, తరువాత భాష్పవాయువు ప్రయోగించి వారిని అక్కడి నుంచి పంపించివేశారు. బిష్ణుపూర్‌లో చాలా మంది మహిళలతో కూడిన రాహుల్ మద్దతుదార్లు వీధుల్లోకి వచ్చి రాహుల్‌ను అనుమతించాలని పట్టుపట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్కడికి వెళ్లిరాలేదా? మరి రాహుల్ ఎందుకు అక్కడికి వెళ్లకూడదు? దేనికి అభ్యంతరం అని ఓ మహిళ అధికారులను నిలదీసింది.

అనుచితం, అప్రజాస్వామికం రాహుల్ అడ్డగింతపై ఖర్గే స్పందన
మణిపూర్ పర్యటన సందర్భంగా రాహుల్ కాన్వాయ్‌ను అధికారులు అడ్డుకోవడం అనుచితం అని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. మణిపూర్ నెలల తరబడిగా రగిలిపోతోందని , తల్లడిల్లుతున్న ప్రజల వద్దకు వెళ్లేందుకు యత్నించిన రాహుల్‌ను నిలిపివేసేందుకు ప్రధాని మోడీ నిరంకుశ వైఖరిని అవలంభించారని దేశ రాజధానిలో ఖర్గే ప్రకటన వెలువరించారు. ప్రభుత్వ చర్య అసహేతుకం అని, రాజ్యాంగ, ప్రజాస్వామిక నీతి నియమాలకు విరుద్ధం అని తెలిపారు. ప్రధాని మోడీకి చెందిన డబుల్ ఇంజిన్ విధ్వంసకర ప్రభుత్వాలు ఈ విధంగా ప్రజలను పరామర్శించే వారిని అడ్డుకుంటున్నాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News