Wednesday, January 22, 2025

రిమోట్ గాంధీగా మారిన రాహుల్ గాంధీ: వేముల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ .. రిమోట్ గాంధీగా మారిపోయారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇక్కడి సన్నాసులు ఏది రాసిస్తే అది చదివేందుకు రాహుల్ అవసరం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదని విమర్శించారు. సోమవారం బిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ ఎం.ఎస్.ప్రభాకర్, ఎంఎల్‌ఎలు, రెడ్యా నాయక్, సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఖమ్మం సభలో రాహుల్ వ్యాఖ్యలు చూస్తే ఆయన పప్పే అనేది నిజమని తేలిందని ఎద్దేవా చేశారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఉన్నాయా అని నిలదీశారు. ఛత్తీస్‌ఘడ్ వృద్ధాప్య పెన్షన్ రూ.500, రాజస్థాన్‌లో రూ.750 ఇస్తున్నారని అదే తెలంగాణలో వికలాంగులకు రూ.4 వేలు ఇస్తున్నామని మంత్రి చెప్పారు. ముందుగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో రూ.4 వేలు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అవినీతికి అడ్రస్‌గా మారిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే రూ.80 వేల కోట్లతో అయితే,అందులో లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎలా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగినన్ని స్కాములు ఎక్కడా జరుగలేదని, మీరు స్కాములకు రారాజులని విమర్శించారు. రాహుల్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ మాజలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా సిఎం కెసిఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో మార్పుకోసం వచ్చిన పార్టీ బిఆర్‌ఎస్ అని పేర్కొన్నారు. తామెవరికీ ఏ టీమ్, బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీయే ఏ టీమ్, బీ టీమ్‌గా మారుతుందని విమర్శించారు. ఈటల, రేవంత్‌రెడ్డి రహస్య భేటీ నిజం కాదా అని నిలదీశారు. ఎవరు, ఎవరికి బీ టీమో ఇప్పుడు చెప్పాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల అవసరాలు, కష్టాలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని చెప్పారు.

సిఎం కెసిఆర్‌ది రాచరికం కాదని, 88 ఎంఎల్‌ఎ సీట్లు గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. రాహుల్‌గాంధీ ఎంపీగా ఓడిపోయారని పేర్కొన్నారు. అసలు రాహుల్‌గాంధీకి ఏ పదవి ఉందని హామీలు ఇస్తున్నారని, కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌గాంధీ తానే రాజు అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. తెలంగాణను మొదటి నుంచి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ కాదా..? అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది అమరులు కాంగ్రెస్ పార్టీ కారణం కాదా.? అని ప్రశ్నించారు. 2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే ఇంతమంది చనిపోయే వారా..? అంటూ ధ్వజమెత్తారు. విధిలేని పరిస్థితుల్లో అనివార్యంగా కాంగ్రెస్ పదేళ్లు ఆలస్యంగా తెలంగాణ ఇచ్చిందని చెప్పారు.
కాంగ్రెస్ అంటేనే స్కాంల పార్టీ : మంత్రి పువ్వాడ
కాంగ్రెస్ అంటేనే స్కాంల పార్టీ అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు అవకాశవాదులని, ఖమ్మం సభలో కాంగ్రెస్‌లో చేరినవారంతా అవకాశ వాదులేనని ఆరోపించారు. ఖమ్మం సభ సందర్భంగా ఆ పార్టీలో చేరిన నేతల్లో పొంగులేటి సహా ఎవరికీ బిఆర్‌ఎస్ అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. తెల్లం వెంకట్రావ్, పిడమర్తి రవి, కోరం కనకయ్య టికెట్ ఇచ్చినా గెలవలేదని చెప్పారు. ఈసారి ఖమ్మంలో తొమ్మిది సీట్లు గెలిచి చరిత్ర సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ హ్యాట్రిక్ కొడతారని, దానిని ఎవరూ ఆపలేరని అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మెచ్యూరిటీ లేని లీడరని విమర్శించారు. భారత్ జోడో యాత్రతో రాహుల్‌గాంధీలో పరిపక్వతన చెందిందని అనుకున్నా అని, కానీ అలాంటిదేమి లేదని ఖమ్మంలో నిరూపించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని మించిన కుటుంబ అవినీతి పార్టీ ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. నాయకత్వం వద్దని పక్కకు జరిగిన నేత రాహుల్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను నట్టేట ముంచి పక్కకు జరిగిన నేత ఖమ్మం వచ్చి మాట్లాడారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం పోటీ ఎందుకు ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. అక్కడ బిజెపితో మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదా అని నిలదీశారు. ఆ పార్టీ నేతల ఇండ్లపై ఐటీ, ఇడి దాడులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో భూమి నుంచి ఆకాశం వరకు అన్నింట్లో కుంభకోణమేనని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ 100 స్థానాలు గెలుచుకుంటుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్‌లో చేరినవారంతా ప్రజలు తిరస్కరించినవాళ్లేనని విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News