మాజీ ప్రధాని బోధనలు నాకు స్ఫూర్తి
రాజీవ్ గాంధీకి రాహుల్ ప్రగాఢ నివాళి
రాజీవ్‌కు కాంగ్రెస్ శ్రద్ధాంజలి
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా ఆయనకు లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ప్రగాఢ నివాళి అర్పించారు. మాజీ ప్రధాని బోధనలు తనకు స్ఫూర్తి అని, భారత్ కోసం ఆయన కలలను తాను నెరవేరుస్తానని రాహుల్ తెలిపారు. ఢిల్లీలోని వీర్ భూమిలోని తన తండ్రి సమాధి వద్ద రాహుల్ పుష్పాంజలి ఘటించారు. ‘దయార్ద హృదయుడు, సామరస్యానికి, సుహృద్భావానికి ప్రతీక& నాన్నా ! మీ బోధనలు నాకు స్ఫూర్తి, భారత్ కోసం మీ కలలు నావే, నా వెంట మీ జ్ఞాపకాలతో వాటిని నెరవేరుస్తా’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో హిందీ పోస్ట్‌లో పేర్కొన్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది. ‘రాజీవ్ కోట్లాది మంది భారతీయుల్లో ఆశలు రేకెత్తించి, తన ‘కనివిని ఎరుగని కృషి’తో భారత్‌ను 21వ శతాబ్దికి తెచ్చారు’ అని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. అత్యంత పిన్నవయస్కుడైన ప్రధాని రాజీవ్ గాంధీ1984 నుంచి 1989 వరకు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. 1991లో ఎల్‌టిటిఇ ఆత్మాహుతి బాంబర్ ఆయనను హత్య చేసింది.
రాజీవ్‌కు ప్రధాని మోడీ నివాళి
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నివాళులు అర్పించారు. ‘మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీజీకి జయంతి సందర్భంగా నివాళి’ అని మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు.