Friday, December 20, 2024

రాహుల్‌తో ఉన్న ఆమె చైనా రాయబారి కాదా ?

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi with Chinese envoy at Kathmandu

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత , ఎంపీ రాహుల్ గాంధీ నేపాల్ లోని ఓ నైట్ క్లబ్‌లో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం, రాజకీయంగా తీవ్ర దుమారం రేగడం తెలిసిందే. ఆ వీడియోలో రాహుల్ పక్కన కనిపించిన మహిళ చైనా రాయబారి అని వార్తలు రాగా బిజెపి తీవ్రంగా మండిపడింది. అయితే దీనిపై జాతీయ మీడియా సంస్థ ఫ్యాక్ట్ చెక్ చేయగా ఆమె చైనా రాయబారి కాదని, సీఎన్‌ఎన్ మాజీ విలేకరి సుమ్నిమా ఉదాస్ స్నేహితురాలని, ఆమె నేపాల్ జాతీయురాలని ఆ మీడియా సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ నైట్ క్లబ్ యజమాని చెప్పినట్టు తెలిపింది. రాహుల్‌తోపాటు ఐదు, ఆరుగురు స్నేహితులు కూడా వచ్చారని , అయితే అందులో ఎవరూ చైనా దేశస్థులు లేరని క్లబ్ యజమాని చెప్పినట్టు పేర్కొంది. దాదాపు గంటన్నర పాటు రాహుల్ ఆ క్లబ్‌లో ఉన్నట్టు వెల్లడించింది. సున్నిమా ఉడాస్ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ సోమవారం కాఠ్‌మాండూ వెళ్లారు. విందులో భాగంగా ఓ నైట్‌క్లబ్‌లో ఉన్న వీడియో ఒకటి మంగళవారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.

ఎవరీ సుమ్నిమా ఉదాస్ ?
సుమ్నిమా ఉదాస్ ఓ పాత్రికేయురాలు. అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్ ఇంటర్నేషనల్‌కు ఢిల్లీ ప్రతినిధిగా ఆమె పనిచేశారు. దేశంలో కీలక రాజకీయ పరిణామాలతోపాటు ఆర్థిక , సామాజిక, పర్యావరణ, తదితర రంగాలపై అనేక ఆసక్తికర కథనాలు ఇచ్చారు. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసుతోపాటు మలేషియా విమానం కుప్పకూలడం, కామన్వెల్త్ అవినీతి కుంభకోణం తదితర అంశాల పైనా ప్రముఖంగా కథనాలను రాశారు. ఆమె లింక్డ్ ఇన్ ఖాతాలో తెలిపిన వివరాల ప్రకారం , 2001 నుంచి 2017 వరకు సీఎన్‌ఎన్‌లో పనిచేసిన సుమ్నిమా … 2018 నుంచి లుంబినీ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా , ఫౌండర్‌గా కొనసాగుతున్నారు. లింగ సంబంధిత సమస్యలపై రిపోర్టింగ్ చేసినందుకు గాను 2014 మార్చిలో జరిగిన మహిళా సాధికారత (డబ్లు ఇ ) జర్నలిజం అవార్డులో భాగంగా సుమ్నిమాకు జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.

అలాగే భారత్ లోని గ్రామాల్లో బానిసత్వం గురించి రిపోర్టింగ్ చేసినందుకు 2012 లో ప్రతిష్ఠాత్మక సినీ గోల్డెన్ ఈగల్ అవార్డు గెలుచుకున్న టీమ్‌లో ఉదాస్ కూడా ఒకరు. సుమ్నిమా ఉదాస్ తండ్రి భీమ్ ఉదాస్ దౌత్య అధికారిగా పనిచేశారు. మయన్మార్‌లో నేపాల్ రాయబారిగా సేవలందించారు. దీంతో ఆమె చిన్నప్పటి నుంచి దాదాపు 10 దేశాల్లో ఉన్నారు. వర్జీనియా లోని వాషింగ్టన్ అండ్ లీ యూనివర్శిటీలో బ్రాడ్‌కాస్ట్ జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ఉదాస్, ఆక్స్‌ఫర్డ వర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. మంగళవారం ఈమె వివాహానికే రాహుల్ సోమవారం కాఠ్‌మాండూ వెళ్లారు. మే 5 న హయత్ రీజెన్సీ హోటల్‌లో రిసెప్షన్ జరగనుంది. తమ కుమార్తె పెళ్లికి రాహుల్ గాంధీని ఆహ్వానించినట్టు సుమ్నిమా తండ్రి భీమ్ ఉదాస్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News