మనతెలంగాణ/హైదరాబాద్: రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’ జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని, ఈ యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు సాగుతుందని 6,700 కి.మీల మేర ఈ యాత్ర ఉంటుందని షమా అహ్మద్, ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో అన్యాయం జరుగుతుందని, ఉద్యోగాలు, ఉపాధి లేక యువత అల్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.
ప్రతి ఏడాది 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని బిజెపి మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, గ్యాస్‌తో పాటు అన్ని నిత్యావసర ధరలు పెరిగిపోయాయన్నారు. సామాన్య ప్రజలు జీవనం గడపడం కష్టంగా మారిందన్నారు. మోడీ అబద్ధాలు చెబుతూ… అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిసాన్, దళిత, ఆదివాసీ, అల్ప వర్గాల మీద దాడులు జరుగుతున్నాయని, మణిపూర్‌లో చర్చి, ముస్లిం మైనార్టీ దాడులు జరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వంలో మహిళలపై జరిగిన దాడులకు న్యాయం జరగడం లేదని, బ్రిజ్ భూషణ్ పై ఆధారాలతో సహా తప్పిదాలు జరిగినట్లు ఫిర్యాదులు అందినా ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.