Wednesday, January 22, 2025

భారత్ జోడో యాత్ర ఎవరి కోసం!

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi's Bharat Jodo Yatra

కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ దేశంలో రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ యాత్ర చేబడుతున్నారనడంలో ఎవ్వరికీ సందేహం లేదు. మన దేశంలో రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా ఓట్లను దృష్టిలో ఉంచుకోకుండా ఒక్కడుగు కూడా వేయడం లేదని అందరికీ తెలిసిందే. మరో 150 లోక్‌సభ సీట్లను కాంగ్రెస్ గెలుచుకొనే విధంగా చేయడమే ఈ యాత్ర లక్ష్యం అని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులలో బిజెపి మినహా మరే పార్టీ కూడా సొంతంగా మెజారిటీ స్థానాలు గెలుపొందాలని ప్రయత్నాలు చేసే పరిస్థితులలో లేవు. రెండు సార్లు కూడా యుపిఎ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది 200 కు సమీపంలో సీట్లు గెల్చుకోవడం ద్వారానే కావడం గమనార్హం. అయితే కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి, ప్రజల తీర్పు కోరే సాహసం రాహుల్ చేయడం లేదు. 2019 ఎన్నికలలో ఓటమి షాక్ నుండి ఇంకా బయటపడలేదు. స్వతంత్రం తర్వాత ఎటువంటి ఉద్రిక్తతలను రెచ్చగొట్టకుండా, కేవలం ఓ ప్రభుత్వ పనితీరు కారణంగా ఎన్నికలలో గెలుపొందిన సందర్భం 2009 ఎన్నికలే కావడం గమనార్హం.

మిగిలిన అన్ని ఎన్నికలలో కొన్ని ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు గెలుపొందడం జరిగింది. అయితే 2009లో కాంగ్రెస్ గెలుపుకు రాహుల్ యువ నాయకత్వం కారణం అని చెప్పుకొచ్చిన కాంగ్రెస్ నేతలు అందుకు డా. మన్మోహన్ సింగ్ గురించి ఇప్పటి వరకు ఓ ప్రశంసా పూర్వకంగా మాట అన్న దాఖలాలు లేవు. ఆ తర్వాత 2014, 2019లలో కాంగ్రెస్ ఓటమికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాహుల్ లేదా ఆయన పరివారమే కారణం కారణం. కానీ అందుకు బాధ్యత వహించేందుకు సిద్ధపడటం లేదు. 2019 ఎన్నికల పరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం ఇప్పటివరకు మరెవ్వరిని పూర్తి స్థాయిలో ఆ పదవికి ఎంచుకోకుండా వాయిదా వేస్తూ వచ్చారు. పరిణామాలకు బాధ్యత వహించకుండా మొత్తం పార్టీపై తన ఆధిపత్యం కొనసాగించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. పార్టీ అధ్యక్షుడు ఎవరైనా కేవలం ఓ బొమ్మగా మాత్రమే ఉంటారనే సంకేతం ఇస్తున్నారు. ఇటువంటి ధోరణులు రాజకీయంగా ప్రమాదకరం కాగలవు.

ఎన్నికల్లో ఎక్కడ ఎటువంటి విజయాలు లభించినా అందుకు రాహుల్ కారణం అంటూ, పరాజయాలకు మాత్రం కాదంటూ విచిత్రమైన ధోరణి కనబరుస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తిని అధ్యక్షునిగా ఎంచుకొనే సమయంలో ఈ యాత్ర చేపట్టడం ద్వారా పార్టీ అధ్యక్షుడు ఎవరైనా నిజమైన అధికార కేంద్రం రాహుల్ లేదా ప్రియాంక అనే సందేశాన్ని పార్టీ వర్గాలకు ఇవ్వడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్‌కు కొద్దో, గొప్పో బలం ఉన్న ప్రాంతాలలో మాత్రమే యాత్ర సాగించడం ద్వారా భవిష్యత్తులో పార్టీకి లభించే విజయాలకు రాహుల్ బాధ్యునిగా ప్రచారం చేసుకునే ఉద్దేశం కూడా కనిపిస్తున్నది. జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్‌తో కలసి నడుస్తున్న సిపిఎం అధికారంలో ఉన్న కేరళలో 18 రోజుల వరకు పర్యటిస్తూ, బిజెపి అధికారంలో ఉన్న సొంత రాష్ట్రంలో యుపిలో రెండు రోజులకు మించి చేయకపోవడం ప్రతిపక్షాలలో ప్రతికూల సంకేతాలను మాత్రమే పంపుతున్నది. బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉమ్మడి వేదిక కోసం కెసిఆర్ ప్రయాణిస్తున్న తెలంగాణలో తన యాత్రను పొడిగించుకుని, బిజెపితో కలిసి వ్యవహరిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఎపిలో అడుగు పెట్టడం లేదు. ఏదేమైనా రాహుల్ యాత్ర కొనసాగే ప్రాంతాలను వ్యూహాత్మకంగా ఎంపిక చేయలేదనే అభిప్రాయం కలిగిస్తున్నది.

రాజకీయాలలో నాయకత్వమే విజయాలకు, పరాజయాలకు బాధ్యత వహించవలసి ఉంటుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా లు కానీయండి, రాష్ట్రాలలో కెసిఆర్, అరవింద్ కేజ్రీవాల్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంకె స్టాలిన్ వంటి వారు గాని పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత తమదనే భరోసాను స్పష్టం గా ఇస్తున్నారు. కానీ రాహుల్ అటువంటి భరోసాను పార్టీ వర్గాలకు ఇవ్వడంలో విఫలం అవుతున్నారు. పైగా, కీలక సమయాలలో విదేశీ పర్యటనలకు వెళ్లడం, పార్టీ కీలక నాయకులకు సహితం అందుబాటులో ఉండకపోవడం, కనీసం కీలక అంశాలపై సంప్రదింపులకు సహితం లభించకపోవడం, జనంతో సంబంధం లేని ‘భజనపరులను’ చుట్టూ చేర్చుకొని వారితోనే వ్యవహారాలు నడిపించే ప్రయత్నం చేయడం వంటి పలు కారణాలతో కాంగ్రెస్ వర్గాలలో రాహుల్ నాయకత్వం పట్ల పూర్తి సానుకూలత వ్యక్తం కావడం లేదు.

రాహుల్ నాయకత్వం పట్ల విముఖతతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకులు చాలా మంది నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో, బిజెపి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలను తిప్పికొట్టడంలో ఆసక్తి చూపడం లేదన్నది వాస్తవం. ఆ విషయం లో రాహుల్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నంలో మొత్తం పార్టీని తనతో నడిపించే ప్రయత్నం చేయలేక పోతున్నారు. రాజకీయంగా సోనియా గాంధీకి ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాలలో అందరినీ తనతో కలుపుకొని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్న పేరుంది. అనేక సందర్భాలలో వ్యక్తిగతంగా తనకు ఇష్టం లేని వ్యక్తులకు సహితం ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. పలు రాష్ట్రాలలో నాయకత్వం అప్పచెప్పారు. కానీ రాహుల్ ఇటువంటి విషయాలలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండడం, పార్టీలోనే తగిన సమర్ధత లేని వారికి నాయకత్వం అప్పచెప్పే ప్రయత్నాలు చేస్తుండడంతో కాంగ్రెస్ పలు సందర్భాలలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తున్నది.

పలు రాష్ట్రాలలో కాంగ్రెస్‌లో అసంతృప్తి వర్గాలు రాహుల్ కు సన్నిహితులు కావడం గమనార్హం. సొంత పార్టీ ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసిన నేతలు సహితం ఆయనకు సన్నిహితులు. మధ్యప్రదేశ్‌లో పార్టీ ప్రభుత్వాన్ని బిజెపితో చేతులు కలిపి కూల్చివేసిన జ్యోతిరాదిత్య సింధియాను ప్రోత్సహించింది ఆయనే కదా. రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన సచిన్ పైలట్ ఎవరు? పంజాబ్, అసోం వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎదురు దెబ్బలు తినడానికి సహితం రాహుల్ ప్రోత్సహించిన వారే కారణం కదా? తెలంగాణలో కాంగ్రెస్‌లో కుంపట్లకు పరోక్షంగా రాహుల్ వ్యవహారశైలి కారణం కదా? ప్రధాన ప్రతిపక్ష స్థానం కూడా పొందలేని పార్టీని బలోపేతం చేయడంపై కన్నా తమ కుటుంబ ప్రయోజనాలు లేదా ఆధిపత్యం కాపాడుకొనే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యపరచే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పవలసి వస్తుంది.

బిజెపికి వ్యతిరేకంగా సోనియా గాంధీతో లేదా కాంగ్రెస్‌తో కలసి పోరాడటానికి, ఉమ్మడి వేదికలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్న పలువురు నేతలు రాహుల్ గాంధీతో చేతులు కలపడానికి మాత్రం సిద్ధంగా లేరు. కెప్టెన్ అమరిందర్ సింగ్, హేమంత్ బిస్వా శర్మ, గులాబీ నబి ఆజాద్ వంటి ఎందరో ప్రముఖ నేతలు పార్టీకి దూరం కావడానికి రాహుల్ అపరిపక్వ ధోరణియే కారణంగా కనిపిస్తోంది. శరద్ పవర్, మమతా బెనర్జీ వంటి నేతలు సోనియా గాంధీతో కలసి ఉమ్మడి కార్యాచరణకు సిద్ధంగా ఉన్నారు. కానీ రాహుల్ గాంధీతో కలసి ఎటువంటి సమాలోచనలు సహితం సిద్ధంగా లేకపోవడం గమనార్హం. రాజకీయ పోరాటాలు ఎప్పుడు ముందుండి నడిపించాలి. పర్యవసానాలు బాధ్యత వహించాలి.

కానీ పెత్తనం మాత్రం చేస్తా, బాధ్యత మాత్రం వహించలేను అంటే ప్రజా విశ్వాసం పొందడం అసంభవం కాగలదు. కేవలం యాత్రలు జరపడం కాకుండా, అనుసంధానంగా పార్టీ పరంగా విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టినప్పుడే ప్రజలపై తగు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వరంగల్‌లో బ్రహ్మాండమైన బహిరంగసభ జరిపి, వ్యవసాయ విధానం అంటూ విడుదల చేశారు. ఆ తర్వాత ఏమైంది? కొన్ని మొక్కుబడులు కార్యక్రమాలు మినహా ముందుగా అనుకున్న విధంగా ఎటువంటి ప్రయత్నాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ నేడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్రజలలోకి చొచ్చుకుపోగల నాయకత్వం వివిధ స్థాయిలలో లేకపోవడం. అటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నం జరగకపోవడం. సోషల్ మీడియా ప్రచారంకే పరిమితమైతే ప్రయోజనం ఉండదు. ఆ దిశలో పార్టీ తగు ఆలోచనలు కూడా చేస్తున్న దాఖలాలు లేవు.

* చలసాని నరేంద్ర- 9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News