Tuesday, January 21, 2025

బిస్కెట్ వివాదంపై రాహుల్ గాంధీ వివరణ..

- Advertisement -
- Advertisement -

గుమ్లా(జార్ఖండ్): తన చేతుల మీదుగా ఇచ్చిన బిస్కెట్‌ను శునకం తినకపోవడంతో దాని యజమానికి బిస్కెట్ ఇచ్చి తినిపించమని కోరానని, ఇందులో తప్పేముందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. శునకం తినడానికి నిరాకరించిన బిస్కెట్‌ను రాహుల్ ఒక వ్యక్తికి ఇస్తున్న దృశ్యంతో కూడిన ఒక వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పార్టీ కార్యకర్తల పట్ల రాహుల్ ఈ విధంగానే వ్యవహరిస్తారంటూ బిజెపి నాయకులు విమర్శలు గుప్పించడం వివాదానికి దారితీసింది.

భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఫబ్రవరి 4న జార్కండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో ఉండగా ఈ వీడియోను పార్టీ కార్యకర్తలు చిత్రీకరించారు. మంగళవారం విలేకరులు ఇదే విషయాన్ని రాహుల్ వద్ద ప్రస్తావించగా దీనిపై రాహుల్ వివరణ ఇస్తూ ఆ శునకం తనను చూసి భయపడుతూ, వణుకుతోందని చెప్పారు. నేను బిస్కట్ ఇవ్వగా ఆ శునకం మరింత భయపడి పోయింది. దీంతో ఆ బిస్కెట్‌ను దాని యజమానికి ఇచ్చి మీ చేతుల మీదుగా ఇస్తే అది తింటుందని చెప్పాను. ఆయన ఇచ్చిన బిస్కెట్‌ను శునకం తింది.

ఇందులో వివాదం ఏముంది అంటూ రాహుల్ ప్రశ్నించారు. కాగా.. ఈ వీడియోపై ఆ శునకం యజమాని సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీతో కలసి తన శునకం ఫోటో తీసుకుందని, ఆయన బిస్కెట్ కూడా ఇచ్చారని శునకం జజమాని తెలిపారు. అయితే..రాహుల్ గాంధీ వైరల్ వీడియోపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం రాత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. రాహుల్ గాంధీయే కాదు.. ఆ కుటుంబం మొత్తం నా చేత ఆ బిస్కెట్‌ను తినిపించలేరు. నేను అస్సామీని, భారతీయుడిని. బిస్కెట్‌ను తినడానికి నిరాకరించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాను అంటూ ఆయన ట్వీట్ చేశారు.

బిజెపి ముంబై ఐటి, సోషల్ మీడియా సెల్‌కు చెందిన పల్లవి ఎక్స్‌లో రాసిన ఒక పోస్టుకు స్పందిస్తూ హిమంత ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తన పెంపుడు శునకం పిడికి చెందిన ప్లేట్‌లోని బిస్కెట్లనే హిమంత బిశ్వ శర్మ చేత తినిపించారని పల్లవి రాశారు.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ కార్యకర్తలను కుక్కలతో పోల్చారని, ఇప్పుడు యువరాజు కుక్క తిరస్కరించిన బిస్కెట్‌ను పార్టీ కార్యకర్తకు ఇచ్చారని ఆమె ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్ల పట్ల రాహుల్ చూపే గౌరవం ఇదేనా అంటూ ఆమె ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News