వారణాసి: ప్రయాణిస్తున్న విమానం వారణాసిలో దిగేందుకు అధికారులు అనుమతించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ రాయ్ ఆరోపించారు. రాయ్ మంగళవారం మాట్లాడుతూ రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి విమానంలో తిరిగి వస్తుండగా రాత్రి ఈ ఘటన జరిగిందన్నారు. షెడ్యూల్ ప్రకారం విమానం బాబత్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాలని అయితే అధికారులు అనుమతించలేదని తెలిపారు.
రాహుల్‌గాంధీకి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారని, విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతి రాకపోవడంతో చివరి నిమిషంలో రాహుల్ దేశరాజధానికి వెనుదిరిగారని వివరించారు. రాయ్ ఆరోపణలపై స్పందించిన వారణాసి ఎయిర్‌పోర్టు అధికారులు ఆరోపణలు అవాస్తవాలుగా పేర్కొన్నారు. వారణాసి ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఆర్యమ సన్యాల్ కాంగ్రెస్ ఆరోపణలను ట్విట్టర్ వేదికగా ఖండించారు. విమానాశ్రయంలో ల్యాండింగ్‌ను రద్దు చేసుకున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం అందించారని సన్యాల్ వెల్లడించారు.