బోదెలి (గుజరాత్): వయనాడ్, రాయబరేలీ లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత రాయబరేలీలో భారీ తేడాతో ఓడిపోతారని అమిత్ షా జోస్యం చెప్పారు. గుజరాత్‌లో గిరిజనుల ప్రాబల్యం గల ఛోటా ఉదయ్‌పూర్ జిల్లాలోని బోదెలి పట్టణంలో ఒక సభలో అమిత్ షా ప్రసంగిస్తూ, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులకు ఉద్దేశించిన కోటాను హరించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి యోచిస్తోందని ఆరోపించారు.
‘కాంగ్రెస్ పార్టీ తమ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఆయన అమేథీలో ఓడిపోయినప్పుడు వయనాడ్‌కు వెళ్లారు. ఈ దఫా వయనాడ్‌లో ఓడిపోతానని గ్రహించిన ఆయన అమేథీకి బదులుగా రాయబరేలీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు’ అని అమిత్ షా ఆక్షేపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ, వయనాడ్ స్థానాలకు పోటీ చేశారు.
వయనాడ్‌లో గెలిచిన రాహుల్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో అమేథీ సీటును కోల్పోయారు. ‘రాహుల్ బాబా, నా సలహా పాటించంది. మీతో సమస్య ఏమిటంటే సీట్ల గురించి కాదు. మీరు భారీ తేడాతో రాయబరేలీలో కూడా ఓడిపోతారు. మీరు పారిపోయినా జనం మిమ్మల్ని కనుగొంటారు’ అని అమిత్ షా అన్నారు. ఛోటా ఉదయ్‌పూర్ (ఎస్‌టి) లోక్‌సభ స్థానానికి బిజెపి అభ్యర్థి జషూభాయ్ రథ్వా తరఫున ప్రచారం చేస్తూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మరొక విడత గెలిచిన పక్షంలో రిజర్వేషన్లు రద్దు చేస్తారని ‘రాహుల్ బాబా, బృందం’ అబద్ధం ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ‘రాహుల్ బాబా! మోడీకి 2014, 2019లో పూర్తి ఆధిక్యం లభించింది. కానీ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు ఉద్దేశించిన రిజర్వేషన్‌ను ఆయన ఎన్నడూ ముట్టుకోలేదు. బిజెపి అధికారంలో ఉన్నంత వరకు మీ రిజర్వేషన్‌ను ఎవరూ తాకలేరన్నది మోడీ గ్యారంటీ’ అని అమిత్ షా చెప్పారు.
దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులకు ఉద్దేశించిన కోటాను హరించింది ఇండియా కూటమే అని కేంద్ర మంత్రి ఆరోపించారు. ‘కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత వారు (కాంగ్రెస్) ఒబిసిలకు ఉద్దేశించిన 4 శాతం కోటాను హరించి ముస్లింకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌ళో వారు ముస్లింకు ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారు. దాని వల్ల ఒబిసిలకు ఉద్దేశించిన కోటా తగ్గిపోయింది’ అని అమిత్ షా తెలిపారు. ప్రతిపక్షం అధికారంలోకి వచ్చినట్లయితే, వారు ఈ వర్గాలకు ఉద్దేశించిన కోటాను లాక్కుని ముస్లింలకు ఇస్తారని ఆయన ఆరోపించారు. ‘ఆ రాష్ట్రాల్లో ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్‌ను వారు వెనుకకు తీసుకోవాలని అనుకుంటున్నారా అని అడగదలిచాను. దీనికి గురివింద గింజ సామెత వర్తిస్తుంది. రిజర్వేషన్‌ను లాక్కున్నది వారు.
కానీ ప్రధాని నరేంద్ర మోడీపై వారు ఆరోపణలు చేస్తున్నారు’ అని అమిత్ షా చెప్పారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని, జమ్మూ కాశ్మీర్‌లో 370 అధికరం రద్దును ఆ పార్టీ వ్యతిరేకించిందని కూడా ఆయన ఆరోపించారు. ‘రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం కోసం రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి, తుదకు అర్వింద్ కేజ్రీవాల్‌కు ఆహ్వానాలు పంపాం. కాని ఎవ్వరూ రాలేదు. ఎందుకంటే వారు తమ వోటు బ్యాంక్ గురించి భయపడ్డారు. వారి వోటు బ్యాంక్ ఏదో మీకు తెలుసని అనుకుంటా. కానీ ఆ వోటు బ్యాంక్ భయం మాకు లేదు’అని అమిత్ షా చెప్పారు. ప్రధాని మోడీ తన పది సంవత్సరాల పాలనలో దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించారని కేంద్ర మంత్రి తెలిపారు.