Sunday, December 22, 2024

మణిపూర్ బాధితులకు రాహుల్ భరోసా

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లోని జిరిబం, చురచంద్‌పూర్ జిల్లాలలోని పునరావాస శిబిరాలను లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం సందర్శించి అక్కడ తలదాచుకున్న నిర్వాసితులతో మాట్లాడారు. గత ఏడాది మే నెలలో ప్రారంభమైన జాతుల మధ్య ఘర్షణలలో ఇప్పటి వరకు 200 మంది మరణించగా నిర్వాసితులైన పౌరులు సహాయ శిబిరాలలో తలదాచుకున్నారు. మణిపూర్‌లోని రెండు లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న తర్వాత ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి సంక్షుభిత రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. ఘర్షణలు ప్రారంభమైన తర్వాత రాహుల్ గాంధీ మణిపూర్‌ను సందర్శించడం ఇది మూడవసారి.

ఈ ఏడాది జనవరిలో రాహుల్ తన భారత్ జోడో న్యాయ యాత్రను మణిపూర్ నుంచే మొదలు పెట్టడం విశేషం. తన తాజా పర్యటనలో రాహుల్ మొదగటా జిరిబం హయ్యర్ సెకండరీ స్కూలులో నెలకొల్పిన సహాయ శిబిరాన్ని సందర్శించారు. తాము ఎదుర్కొన్న దుర్భర పరిస్థితిని, తమ అనుభవాలను జిరిబంలో నిర్వాసితులు రాహుల్ గాంధీకి వివరించినట్లు మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కీషం మేఘచంద్ర విలేకరులకు తెలిపారు. వారికి అవసరాలు ఏమిటో కూడా రాహుల్ నిర్వాసితులను అడిగి తెలుసుకున్నారని ఆయన చెప్పారు.

ప్రధాన మంత్రి కాని, ముఖ్యమంత్రి కాని తమ వద్దకు రాలేదని ఒక బాలిక రాహుల్‌కు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఆ బాలిక రాహుల్‌ను కోరినట్లు ఆయన చెప్పారు. జిరిబంలో రాహుల్ గాంధీని కలుసుకునేందుకు వేలాది మంది తరలివచ్చారని, రాహుల్‌కు తమ కష్టాలు చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారని మేఘచంద్ర తెలిపారు. జిరిబం నుంచి అస్సాంలోని సిల్చర్ మీదుగా రోడ్డు మార్గంలో ఇంఫాల్ విమానాశ్రయం చేరుకున్న రాహుల్ చురంద్‌పూర్ ఇజిల్లాలోని తుయిబాంగ్ గ్రామంలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాన్ని సందర్శించారు.

అక్కడ కూడా ఆయన నిర్వాసితులతో మాట్లాడారు. ప్రజలకు మద్దతు ఇవ్వడంతోపాటు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అంచనా వేయడమే రాహుల్ గాంధీ పర్యటన లక్షమని మేఘచంద్ర తెలిపారు. ఇటీవల జరిగిన ఘర్షణలలో తీవ్రంగా నష్టపోయిన బాధితుల సమస్యలను తెలుసుకోవడం పట్ల కాంగ్రెస్ చూపుతున్న చిత్తశుద్ధికి ఈ పర్యటనే నిదర్శనమని ఆయన అన్నారు. మణిపూర్‌లో గత ఏడాది మే నెలలో మైతీ, కుకీ జాతుల మధ్య ప్రారంభమైన హింసాత్మక ఘర్షణలలో 200 మందికిపైగా ఇరుపక్షాల ప్రజలు మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News