న్యూఢిల్లీ: సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులతో లోక్‌సభ విపక్షనేత , కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ మంగళవారం భేటీ అయ్యారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన గ్యారంటీ , రుణభారం నుంచి విముక్తి కల్పించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రాడానికి ఈ సమావేశంలో చర్చించారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్సులో రాహుల్‌ను ఆయన కార్యాలయం లోనే రైతు ప్రతినిధులు 11 మంది కలుసుకున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కెసి వేణుగోపాల్, జైరామ్ రమేశ్ కూడా పాల్గొన్నారు.
ఎన్‌జివొ సర్వ సేవా సంఘ్ ప్రతినిధి బృందం కూడా రాహుల్‌ను కలుసుకున్నారు. రాహుల్‌ను మరో వ్యవసాయ ప్రతినిధుల బృందం రెండు వారాల క్రితం కలుసుకున్న తరువాత సంయుక్త కిసాన్ మోర్చా బృందం ఇప్పుడు కలుసుకుంది. కనీస మద్దతు ధరలకు చట్టపరమైన గ్యారంటీ లభించేవరకు పోరాడుతామని , దీనికి ఇండియా కూటమి అంకితమైందని రాహుల్ పార్లమెంట్ లోనూ, బయట పదేపదే హామీ ఇచ్చారు.