మహాత్మాగాంధీ సూక్తిని గుర్తు చేసిన కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ: విదేశీ వ్యాక్సిన్లకు అనుమతుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోనున్నట్టు కేంద్రం తాజాగా చేసిన ప్రకటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రం సంధించారు. అదే విషయాన్ని తాము సూచించినపుడు బిజెపి నేతలు విమర్శించడాన్ని రాహుల్ గుర్తు చేశారు. ‘మొదట వారు నిన్ను పట్టించుకోరు. ఆ తర్వాత నిన్ను చూసి నవ్వుతారు. నీతో పోరాటం చేస్తారు. అప్పుడు నీవు గెలుస్తావు’ అంటూ మహాత్మాగాంధీ ప్రసిద్ధ సూక్తిని రాహుల్ ఈ సందర్భంగా ఉటంకించారు. అమెరికా, యుకె, ఇయు, జపాన్‌లాంటి దేశాల్లో ఇప్పటికే అనుమతులు పొందిన వ్యాక్సిన్ల విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని ఇటీవల కేంద్రం అభిప్రాయపడటం తెలిసిందే. దీనిపై రాహుల్ ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. వ్యాక్సిన్ల కొరతపై రాహుల్ వ్యాఖ్యలను తిప్పిగొడ్తూ ఇటీవల కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్ విమర్శలు చేయడం గమనార్హం. విదేశీ ఫార్మా కంపెనీల తరఫున రాహుల్ లాబీయింగ్ చేస్తున్నారని రవిశంకర్‌ప్రసాద్ ఆరోపించారు.