ప్రజాపాలన విజయోత్సవాల్లో
అలరించిన ఎయిర్‌షో, రాహుల్
సిప్లిగంజ్ మ్యూజికల్ షో
అంబరాన్నంటిన సంబురాలు
30 నిమిషాల పాటు ఆకాశంలో
కనులవిందు చేసిన సూర్యకిరణ్
విన్యాసాలు భారీగా తరలివచ్చిన
సందర్శకులు సిఎం రేవంత్ సహా
ప్రముఖుల హాజరు
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో జరిగిన పలు కార్యక్రమాలకు సిఎం రేవంత్, మంత్రులు హాజరయ్యారు. ఎయిర్‌షోతో పాటు రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కార్యక్రమాలను ఆయన తిలకించారు. ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఎయిర్ షో ఆదివారం సాయంత్రం 4: 30 గంటలకు మొదలు కాగా ఈ ఎయిర్ షో దాదాపుగా 30 నిమిషాల పాటు జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన వైమానిక విన్యాసాలు చూపురులను ఆకట్టుకున్నాయి. నెక్లెస్ రోడ్, హెచ్‌ఎండియే గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సందర్శకులు పెద్దఎత్తున వచ్చారు. వీకెండ్ కావడంతో నగరవాసులే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా పెద్దసంఖ్యలో ప్రజలు వచ్చారు. ఎయిర్ షోకు హీరోయిన్లు మీనాక్షి చౌదరి, అంజలితో పాటు మరికొందరు సినీ నటులు హాజరయ్యారు.
సుమారు 30 నిమిషాల పాటు విన్యాసాలు
ప్రజా పాలన- ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా ట్యాంక్‌బండ్ నెక్లెస్‌రోడ్ వద్ద జరిగిన ఎయిర్ షో అట్టహాసంగా జరిగింది. 9 సూర్యకిరణ్ విమానాలతో జరిగిన ఎయిర్ షో అద్భుతంగా ఉందని సందర్శకులు కితాబునిచ్చారు. వైమానిక కళాత్మకతకు అదనపు రంగును జోడించి, శక్తివంతమైన స్మోక్ ట్రయల్స్ ద్వారా మిరుమిట్లు గొలిపే అద్భుతం అందరినీ ఆకట్టకుందని వారన్నారు. 1996లో ఏర్పాటైన సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ నేతృత్వంలోని ఈ ఉత్కంఠభరితమైన విన్యాసాలు సందర్శకులను అలరించాయి. ఫ్లయింగ్, సాహసోపేతమైన విన్యాసాలకు వారు ప్రసిద్ధి. ఈ బృందం తొమ్మిది హాక్ ఎంకె 132 విమానాలను నడుపుతుంది. వాటి మధ్య కేవలం ఐదు మీటర్ల దూరం ఉంచుతుంది. ఈ విమానాలను ప్రధానంగా అధునాతన యుద్ధ శిక్షణ కోసం ఉపయోగిస్తారు. అయితే, సుమారు 30 నిమిషాల పాటు ఈ విమాన విన్యాసాలు కొనసాగాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నయాలుక్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నయాలుక్ ఆకట్టుకుంది. ఈ ఎయిర్ షోలో రేవంత్ రెడ్డి స్పెషల్ లుక్‌లో కనిపించారు. జెట్ ప్లేన్స్ విన్యాసాలను స్వయంగా సిఎం రేవంత్ రెడ్డి తిలకించారు. సిఎం రేవంత్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్, కళ్ల అద్దాలతో ఎయిర్ షోకు వెళ్లడంతో అచ్చం సినిమా హీరోలా ఉన్నారని పలువురు పొగడ్తలతో ముంచెత్తారు.
హ్యాండీక్రాఫ్ట్, ఫుడ్‌స్టాళ్ల ఏర్పాటు
అంతేకాకుండా హెచ్‌ఎండిఏ గ్రౌండ్స్‌లో హ్యాండీక్రాఫ్ట్, ఫుడ్‌స్టాళ్లను ఏర్పాటు చేయగా సిఎం, మంత్రులు వాటిని పరిశీలించారు. అనంతరం ఐమాక్స్ గ్రౌండ్స్ లో ప్లాన్ చేసిన రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం మూడుగంటల నుంచి 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
సచివాలయంలో విగ్రహా ఆవిష్కరణ ఏర్పాట్లు పరిశీలన
ఎయిర్ షో అనంతరం సచివాలయంలో విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లను సిఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల బృందం పరిశీలించింది. సచివాలయంలో పర్యటించిన సిఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు. ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా చూడాలని, ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సిఎం సూచించారు. ఈ కార్యక్రమంలో సిఎంతో పాటు మంత్రులు, టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.