రైతుల మరణాల రికార్డులు కాంగ్రెస్ వద్ద ఉన్నాయని వెల్లడి!!
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన సమయంలో మరణించిన రైతుల రికార్డులు తమ వద్ద లేవని ప్రభుత్వం చెప్పడాన్ని ‘సున్నితత్వంలేని’, ‘అహంకారపూరిత’ వైఖరిగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఎండగట్టారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సమయంలో రైతులు మరణించడానికి పంజాబ్ ప్రభుత్వం కారణం కాదని, అయినప్పటికీ ఆ రాష్ట్రంలో చనిపోయిన 403 రైతు కుటుంబాలకు పంజాబ్ ప్రభుత్వం రూ. 5లక్షల చొప్పున పరిహారం ఇచ్చిందని పేర్కొన్నారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సమయంలో పంజాబ్ వెలుప చనిపోయిన 100 మంది రైతుల జాబితా, 200 మంది రైతులు చనిపోయిన మరో జాబితా కాంగ్రెస్ వద్ద ఉందని, ఆ జాబితాను పబ్లిక్ రికార్డుల ద్వారా కూర్చినదని రాహుల్ గాంధీ తెలిపారు. పార్లమెంటు ముందు సోమవారం ఆ జాబితాలను పెడతానని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ తెలిపారు. ఆయన ఇంకా సాగు చట్టాల రద్దు డిమాండేకాక, రైతుల ఇతర డిమాండ్ల గురించి మాట్లాడుతూ “ రైతుల డిమాండ్లను ప్రభుత్వం ఆమోదిస్తుందని నేనైతే అనుకోవడంలేదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్దేశాలు సరైనరీతిలో లేవు” అని ఆయన వ్యాఖ్యానించారు.